రేవంత్‌రెడ్డికి మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు వంద కోట్లు ఖర్చుపెట్టడంపై ఉన్న ఆరాటం.. విద్యార్థులకు మంచి ఆహారం అందించడంపై లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఫుట్‌బాల్ మీదున్న శ్రద్ధ.. తెలంగాణలో రైతులు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు.. విద్యార్థుల మరణాల మీద లేదు. -హరీశ్‌రావు
సుల్తాన్‌బజార్, డిసెంబర్ 13: సీఎం రేవంత్‌రెడ్డి విజన్ 2047 విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 20 మం ది విద్యార్థులను ఆయన కింగ్‌కోఠి జిల్లా దవాఖానలో శనివారం పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆర్వీ మహేందర్ ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడు తూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు రూ.వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ విద్యార్థులకు సరైన ఆహారాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో చనిపోతున్న రైతు లు, ఆటోడ్రైవర్లు, విద్యార్థుల మీద లేదని వా పోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులే స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక గురుకులం లేదా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని దవాఖానల పాలవుతున్నారని ఆరోపించారు. ఇటీవల శామీర్‌పేట్‌లోని బీసీ గురుకుల పాఠశాలలో అన్నం లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని, మాదాపూర్‌లోని చంద్రూనాయక్ తండాలో మధ్యా హ్న భోజనం వికటించి 43 మంది విద్యార్థులు దవాఖానపాలయ్యారని తెలిపారు. తాజాగా బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 90 మంది అస్వస్థతకు గురయ్యారని అన్నారు.
హాస్టళ్లలో దొడ్డు బియ్యమా?
సీఎం రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని హరీశ్‌రావు సవాల్‌చేశారు. కల్తీ ఆహారం తిని దవాఖానల్లో చేరిన విద్యార్థులు మళ్లీ హాస్టల్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారని చెప్పా రు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్ విద్యార్థులకు దొడ్డు బియ్యం పెడుతున్నదని, అన్నం ఉడకడం లేదని, సరైన భోజనం పెట్టడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. టీవీలు, పేపర్ల యాడ్లలో మాత్ర మే తెలంగాణ రైజింగ్ అని, వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హాస్పిటల్స్‌లో ఫాలింగ్ అని విమర్శించారు. ‘అసలు ఈ రైజింగ్ దేంట్లో? అవినీతిలోనా? అరాచకంలోనా? అహంకారంలోనా లేక కబ్జాలలోనా’ అని ప్రశ్నించారు. రూ. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నాడని, కానీ అప్పటిదాకా పిల్లలు బతికుండేది ఎట్లా అని నిలదీశారు. ‘పిల్లలు దవాఖానలో పడితే నీ మంత్రి రాడు, నువ్వు రావు, నీకు టైమ్ దొరకదు, ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నవు’ అంటూ విరుచుకుపడ్డారు. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటంలో బిజీగా ఉన్న సీఎం, అందుకోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు.
ఇన్నాళ్లూ రాహుల్‌గాంధీ ఎటుపోయిండు?
‘ఆరు గ్యారెంటీలు అమలుచేసే జిమ్మేదారి నాది అన్న రాహుల్‌గాంధీ ఎటు పోయిండు? ఈ రోజు రాష్ట్రంలో సుమారు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 160 మంది ఆటోడ్రైవర్లు, 116 మంది విద్యార్థులు చనిపోతే, 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరాటం చేస్తుంటే రాష్ట్రం ముఖం చూడని రాహుల్‌గాంధీ ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి మాత్రం వచ్చాడు’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
సీటీ స్కాన్ కేంద్రానికి తాళంపై ఆగ్రహం
కింగ్‌కోఠి దవాఖానలో అల్ట్రా సౌండ్ కేం ద్రాన్ని మధ్యాహ్నమే మూసివేయడం, సీటీ స్కాన్ పరీక్ష కేంద్రానికి తాళం వేసి ఉండటంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కడుపునొప్పితో ఉన్న విద్యార్థినికి అల్ట్రాసౌండ్ చేయలేదని, మధ్యాహ్నం రెండు గంటల వరకే చేస్తామని సూపరింటెండెంట్ చెప్తున్నారని విమర్శించారు. ఆ విద్యార్థిని రాత్రి నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నా పట్టించుకున్న వారు లేరని మండిపడ్డారు.
ఆర్థిక సమస్యలతో పోలీసుల సతమతం
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పేరుకే పోలీసు ఉద్యోగం.. కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి దాకాఅధికారుల్లో ఎవరిని కదిలించినా సినిమా కష్టాలే చెప్తున్నారు. కారణం.. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఏరియర్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, టీఏలు. ఒక్కో పోలీసు అధికారికి సగటున ఒక సరెండర్ కింద సుమారుగా రూ.30-50 వేలు రావాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో నాలుగైదు పెండింగ్‌లో ఉ న్నట్టు చెప్తున్నారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని పలువురు పోలీసు సిబ్బంది మాజీ మంత్రి హరీశ్‌రావుతో చెప్పుకున్నారు. కింగ్‌కోఠి దవాఖానలో శనివారం ఫుడ్‌పాయిజన్ బాధిత విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన హరీశ్తోరావుతో వారు తమ గోడు చెప్పుకున్నారు. 2003 కంటే ముందు పోలీసు ఉద్యోగానికి ఎంపికైన వారికి జీపీఎఫ్ కింద పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇంటి ఖర్చు, ఆరోగ్య అవసరాల కోసం బిల్లులు పెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేదని తెలిపారు. ఆరోగ్య భద్రత పథకం నుంచి దవాఖానలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగు ఉండటంతో పోలీసులకు చికిత్స చేయడానికి దవాఖానలు నిరాకరిస్తున్నాయని చెప్పారు.
అన్నీ బకాయిలే.. ఎప్పుడిస్తరో తెల్వదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరెండర్ లీవ్ డబ్బులు రావడం లేద ని, పెండింగ్ డీఏలు కూడా విడుదల చే యడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేషన్ మెయింటెనెన్స్ అలవెన్సులు కూడా బంద్ పెట్టారని, రిటైర్ అయినవారికి బెనిఫిట్స్ కూడా ఆపేశారని వాపోయారు. ఇప్పటికే మూడు డీఏలు, ఏడాది టీఏలు, నాలుగు సరెండర్ల వంటివి రావాలని, అవన్నీ లెక్క కడితే.. ప్రభుత్వం ఒక్కో కానిస్టేబుల్‌కు లక్షల్లోనే బాకీ ఉందని చెప్పారు.