సిద్దిపేట : హైదరాబాద్ తొలి మేయర్‌గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్(Krishna Swami Mudiraj) నగరానికి ఎంతో సేవలు అందించారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. సిద్దిపేట పట్టణంలోని (Siddipet)) ముస్తాబాద్ రోడ్డులో దివంగత కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ముదిరాజ్ సమాజానికి సిద్దిపేటలో సర్పంచులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా అనేక పదవుల్లో వారిని నియమించి గౌరవించామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒక్కటేనని పేర్కొన్నారు. ముదిరాజ్ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ చౌరస్తాని కృష్ణస్వామి జంక్షన్‌గా మారుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ముదిరాజ్ సమాజ్ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.