Harish Rao : ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 30, 40 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ 22ఏ జాబితాలో పెట్టారని తెలిసిందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి పొంగులేటికి రియల్ ఎస్టేట్ తెలిస్తే.. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం తెలుసని హరీశ్‌రావు అన్నారు. సమస్యను పరిష్కరిస్తారా.. ప్రజల కాళ్ల కింద నలిగిపోతారా..? అని ప్రశ్నించారు. ఒక్క ఎకరా కూడా 22ఏ కింద పెట్టలేదని 10 రోజుల క్రితం పొంగులేటి చెప్పారని, ఇప్పుడు అధికారులు తప్పు చేశారని చెబుతున్నారని విమర్శించారు. నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎం రేవంత్‌కు చెప్పానని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని, ఆయన చెప్పినపుడే సీఎం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
దీన్నిబట్టి ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటికి తెలిసే జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందని హరీష్‌రావు అన్నారు. కోట్లాది ప్రజల ఆస్తులను ఇలా పెట్టే ధైర్యం అధికారులకు ఉంటుందా..? అని మండిపడ్డారు. చీటికిమాటికి విచారణలు చేసే రేవంత్‌రెడ్డి.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎంకు సంబంధం లేకపోతే పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.