సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో ప్రజా రవాణా వ్యవస్థల నిర్వహణ ఏ స్థాయిలో దిగజారిందో చెప్పడానికి బేగంపేట్ మెట్రో స్టేషన్ లో శనివారం చోటుచేసుకున్న ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. కామన్ మొబిలిటీ కార్డ్ పనితీరును స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు మెట్రో స్టేషన్లో చేదు అనుభవం ఎదురైంది.
మంత్రులు స్టేషన్కు చేరుకుని ప్లాట్ ఫారమ్పైకి వెళ్తున్న సమయంలో ఎసలేటర్ అకస్మాత్తుగా ఆగిపోయి మొండికేసింది. దీంతో వేరే దారి లేక మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆగిపోయిన ఎసలేటర్ మెట్లను నడుచుకుంటూనే ఎకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘శుభమా అని పెళ్లికి పోతుంటే పిల్లి ఎదురొచ్చినట్లు’.. కామన్ మొబిలిటీ కార్డు పనితీరును పరిశీలించేందుకు వచ్చిన మంత్రుల పర్యటనకు ఈ నిర్వహణ లోపం చెడు శకునంగా మారిందని ప్రయాణికులు నవ్వుకుంటున్నారు.
మెట్రో నిర్వహణ విషయంలో ఎల్అండ్టీతోపాటు, మెట్రో రైలు సంస్థ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిటీ శాపంగా మారింది. నిత్యం నిలిచిపోయే సేవలతో మెట్రో ప్రయాణమే అధ్వానంగా మారింది. పేరుకు లగ్జరీ ప్రయాణమే అయినా.. పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయింది. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా మెట్రో పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రచారాల డొల్లతనం తాజా ఘటనతో మరోసారి తేటతెల్లమైనట్లుగా నిలిచింది. ఎప్పుడూ ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. గతంలో సడెన్ బ్రేక్ డౌన్లతో మెట్రో రైలు ప్రయాణికులు చుక్కలు చూపిస్తున్నవి. ఇటీవల మెట్రో స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
చోద్యం చూసిన మెట్రో యంత్రాంగం..
సాక్షాత్తు డిప్యూటీ సీఎం, మంత్రులు వస్తున్నారంటే నిమిషాల వ్యవధిలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిన మెట్రో యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 15 నిమిషాల పాటు ఎసలేటర్లు స్తంభించిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మంత్రుల సమక్షంలోనే ఇంతటి పెద్ద నిర్వహణ లోపం బయటపడినా మెట్రో అధికారులు కనీసం స్పందించి ఎస్కలేటర్లను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు.
సామాన్యుల పరిస్థితి ఏంటో..
వీఐపీల పర్యటన ఉన్నప్పుడే మెట్రో నిర్వహణ ఈ స్థాయిలో అధ్వానంగా ఉంటే, నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మెట్రోలో సామాన్య ప్రజల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో ఇకనైనా తెలుసుకోవాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకే గతి లేక నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, రోజువారీ ప్రయాణికుల తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. మంత్రులు మెట్రో రైలులో ప్రయాణికులతో మాట్లాడి కామన్ పాస్ వినియోగంపై అభిప్రాయాలు సేకరించినప్పటికీ, ఈ ఎసలేటర్ ఘటన మాత్రం రవాణా శాఖ మెట్రో యంత్రాంగం విఫలమైన తీరును తేటతెల్లం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మెట్రో నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారనడానికి బేగంపేట్ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.