మ॥ సరవిన్ దానము భోగమున్ మరి వినాశంబన్న యిమ్మూడు వై
ఖరులన్ మర్త్యులు సంతరించు ధన సంఘాతంబపేతంబగున్
ధరలో నాద్యము లైన రెండు విధముల్ దప్పన్ తృతీయంబె యె
ల్లరకర్థంబునకౌ జుమీ! సురభిమల్లా! నీతి వాచస్పతీ!
ఈ పద్యం పాలమూరు జిల్లా నివాసిగా ప్రసిద్ధి గాంచిన ఎలకూచి బాలసరస్వతి గారు రచించిన మల్ల భూపాలీయం అనే సుభాషిత కావ్యం లోనిది. భర్తృహరి సంస్కృత సుభాషితాలను తెలుగులోకి అనువదించి ఈ కావ్యం రచించారు. ఈ కావ్యాన్ని జటప్రోలు సంస్థానాధీశ్వరులు సురభి మాధవరాయలకు అంకితం చేశారు. అందుకే కృతిభర్త పేరుతో సురభిమల్లా నీతి వాచస్పతీ అనే మకుటంతో దీనిని రచించారు. పద్యం విషయానికి వస్తే డబ్బుకు సంబంధించి మూడు లక్షణాలను వివరిస్తుంది.
‘నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభి మల్లభూపాలా! ఈ లోకంలో మనుషులు కష్టపడి సంపాదించే ధనం.. దానము, భోగము, నాశనము అనే మూడు గతులు (లక్షణాలు) కలిగి ఉంటుంది. మొదటిది దానం, సంపాదించిన ధనాన్ని అవసరమైన వారికి, పేదలకు దానం చేయడం. రెండోది భోగం- ఆ ధనంతో తనకు కావలసిన సుఖాలను, అవసరాలను తానే అనుభవించడం. మూడోది నాశనం- దానం చేయకుండా, తాను అనుభవించకుండా దాచిపెడితే అది దొంగలపాలు కావడం లేదా మరేదైనా రూపంలో నాశనమైపోవడం ఖాయం. కాబట్టి డబ్బును మొదటి రెండు రకాలుగా ఉపయోగించాలి లేకుంటే దానికి నాశనం తప్పదు’ అనే నీతి ఈ పద్యం వివరిస్తుంది.