హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మల్లన్నసాగర్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008, 2009లో కట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకునేవారని చెప్పారు. వైఎస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల డీపీఆర్‌లో భాగంగా అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీలు, ఇమాంబాద్ 1.5 టీఎంసీలు, తడకపల్లి ఒక టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ ఒక టీఎంసీ అనీ కలిపి ఐదు టీఎంసీలతో ప్రతిపాదించారని, దీంతో రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోవాలని సూచిస్తూ ఆ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్.. సాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీల మల్లన్నసాగర్‌ను నిర్మించారని స్పష్టంచేశారు. వాస్తవాలను విస్మరించి, సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే కట్టామని రేవంత్‌రెడ్డి కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని, ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అకడ కత్తిరిస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదుల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి, ఆర్అండ్ఆర్, ల్యాండ్ అక్విజేషన్ ఇవేవీ పూర్తి కాలేదు. గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2,052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాము. నీలాగా చిల్లర రాజకీయాలకు పోలేదు. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు. డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు. అంటే 12 టీఎంసీలు పోతాయి. ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తికి ఆరున్నర టీఎంసీలు. గూడెం లిఫ్టుకు మూడు టీఎంసీలు. లోకల్లో రామగుండం లిఫ్ట్‌కు ఒక టీఎంసీ వాడుకుంటాం. ఇప్పటికే సామర్థ్యం కంటే ఎకువ వాడుతున్నాం. ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్‌కి ఎలా తెస్తావు రేవంత్‌రెడ్డీ?’ అని ప్రశ్నించారు.
‘ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నయా? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటర్లు ఆన్ చేస్తే మేడారం రిజర్వాయర్‌లో పడతాయి. లక్ష్మీ పంప్‌హౌస్ ఆన్‌చేస్తే వరద కాలువలో పడతాయి. అకడినుంచి మిడ్ మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు వస్తాయి. అకడ నుంచి రంగనాయకసాగర్‌కు వస్తాయి. అక్కడ మళ్లీ మోటర్ ఆన్‌చేస్తే మల్లన్నసాగర్‌కు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు దాకా కెనాల్స్, గ్రావిటీ కెనాల్, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్‌హౌస్‌లు.. అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ హయాంలోనే. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాం. కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మంచినీటి కోసం మల్లన్నసాగర్లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టారు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినవంటే ఆ గండిపేటకు హిమాయత్‌సాగర్‌కు వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే. కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన రూ.93 వేల కోట్లలో నిర్మించింది మల్లన్నసాగర్’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
కామన్ సెన్స్ లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడితే సీఎం కుర్చీకున్న గౌరవం తగ్గుతుందని హరీశ్‌రావు హితవుపలికారు. ‘ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మూడు పంప్‌హౌస్‌లు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. టన్నెల్స్, సబ్స్టేషన్లు, కెనాల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బటన్ నొకి సీతారామ ప్రాజెక్టు మేమే నిర్మించినమని చెప్పుకుంటున్నరు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ దగ్గర మీ మంత్రులే నీళ్లు విడుదల చేసి నెత్తి మీద చల్లుకుంటున్నది నిజం కాదా? ఒకరేమో కాళేశ్వరంను తిట్టుడు. మరొకరు కాళేశ్వరంనకు మొక్కుడు. రూ.7,000 కోట్లతో నువ్వు ప్రారంభించబోతున్న ఈ పథకం కాళేశ్వరం నీళ్లతో కాదా?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
మల్లన్నసాగర్‌ను కట్టవద్దని ఇదే రేవంత్‌రెడ్డి 2016లో 48 గంటలకు దీక్ష చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మల్లన్నసాగర్ కడితే ఆ ప్రాజెక్టు కింద ఒకొక రైతుకు రెండు ఎకరాలు పండే భూమిని ఇవ్వాలని నాడు రేవంత్ డిమాండ్ చేశారు. కానీ, మూసీలో 300 ఇండ్లను కూలగొట్టిన రేవంత్‌రెడ్డి.. చివరికి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రమే వాళ్లకు ఇచ్చి, ఒక రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్లో భూమి కోల్పోయిన వారికి 250 గజాల్లో సొంత ఇంటిని కట్టించి ఇచ్చామని, రూ.2.5 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చామని వివరించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీలో ఖాళీ చేయించిన వారికి రూ.25 వేల చెకు మాత్రమే ఇచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. మూసీ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఒక దీక్షతో మల్లన్నసాగర్ కట్టిండు. ఆదే హైదరాబాద్‌కు, రైతులకు ఒక వరంగా మారింది’ అని స్పష్టంచేశారు.
హైదరాబాద్‌కు బీఆర్ఎస్ సర్కార్ ఒక చుక మంచినీళ్లు తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి మరో అబద్ధం చెప్పారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ఉమ్మడి పాలనలో మంచినీటి కోసం హైదరాబాద్‌లో నీటి యుద్ధాలు జరిగేది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.7,000 కోట్లను హైదరాబాద్ మంచినీటి కోసం ఖర్చు చేశాం. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై ఏడేండ్లయినా పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు తెచ్చే లైన్లో రైల్వే, మిలిటరీ ల్యాండ్ల పర్మిషన్లు పెండింగ్ ఉంటే రెండేండ్లలో అధికారులను ఒప్పించి, స్కీమ్ పూర్తి చేశాం. కృష్ణ ఫేజ్-4తో కూడా హైదరాబాద్‌కు నీళ్లను తెచ్చినం. గ్రేటర్ పరిధిలో రూ.1,600 కోట్లు ఖర్చు చేసి 56 రిజర్వాయర్లు, 2,600 కి.మీ పైప్లైన్లు వేసినం. ఓఆర్ఆర్ ఫేస్-1, ఫేస్- 2లో రూ.2,000 కోట్లు ఖర్చు చేసి ఓహెచ్ఎస్ఆర్ పైపులైన్లు వేశాం. నగరమంతా తాగునీళ్లు అందుతున్నాయంటే బీఆర్ఎస్ సర్కారే కారణం’ అని తెలిపారు.
నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలని, వందేండ్ల భవిష్యత్తు కోసం ఆలోచించామని హరీశ్‌రావు చెప్పారు. ‘నాగార్జునసాగర్ నుంచి 60 టీఎంసీల నీళ్లు తీసుకోవాలని సుంకిశాలను ప్రారంభించినం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 6.5 లక్షల ఎకరాలకు ప్రతిపాదించాం. గ్రావిటీ ద్వారా ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి 6.5 లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన చేశాం. 2014లో అసెంబ్లీలో బిల్లుపై చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.5.000 కోట్లు ఖర్చు చేసి, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. నిన్నేమో 2008-09లో మల్లన్నసాగర్ వైఎస్ఆర్ కట్టిండని మరో అబద్ధం చెప్తున్నరు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు వింటుంటే చార్మినార్ కూడా తమ తాత కట్టిండని చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.
మల్లన్నసాగర్ 50 టీఎంసీల సామర్థ్యంతో కేసీఆర్ నిర్మించినందువల్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నదని హరీశ్‌రావు చెప్పారు. 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండగా మేడిగడ్డకు ఎందుకు పోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రోజు నిజం ఒప్పుకున్నారు. తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉన్నదని అంటున్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయంటున్నారు కదా? తెచ్చి చూపించండి. 148 మీటర్ల వద్ద బరాజ్ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎకువ తీసుకోలేం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ నేత కార్తిక్‌రెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే ఏవైనా వరాలు ప్రకటిస్తారని ఆశించామని కానీ, ఎలాంటి పనులు ప్రకటించకుండానే ఊసూరుమనిపించి వెళ్లారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి స్థానిక ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి 22 నెలల పాలనలో ఒక్క రూపాయి అయినా కేటాయించారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 90% పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. కేవలం కాల్వలు తవ్వితే సరిపోతుంది కదా.. వాటిని ఎందుకు తవ్వడం లేదని నిలదీశారు.