Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయని తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైందని ప్రశంసించారు.
2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా.. “ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని విద్యార్థిని ఫిర్దోస్ చెప్పిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించిందన్నారు. ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గంలోని అదే మైనారిటీ గురుకులం నుంచి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచిందని హరీశ్‌రావు తెలిపారు. నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచిందన్నారు. మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచిందన్నారు. గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదని.. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారని తెలిపారు. దీన్ని మార్చడానికి కేసీఆర్ అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారని పేర్కొన్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారన్నారు. దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ నమ్మారని హరీశ్‌రావు తెలిపారు. రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారన్నారు. విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారన్నారు. ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుందని తెలిపారు. కేసీఆర్ దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం, తెలంగాణ సమాజం విద్యార్థులకు ఎంతో ఇచ్చిందని.. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలని విద్యార్థులకు హరీశ్‌రావు సూచించారు. మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు #KCRForTelangana హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.