రేవంత్‌రెడ్డీ.. నీ సవాల్‌కు నేను సిద్ధం. రేపు రమ్మంటవా? ఎల్లుండి రమ్మంటవా?.. సెక్యూరిటీ లేకుండా వస్తనన్నవ్.. పోదాం పా.. డేట్, టైం మీరే చెప్పండి. కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే శనివారం ఉదయం 9 గంటలకు నేను సిద్ధం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్అండ్ఆర్ కాలనీ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదికి పోదాం.. అకడే కూర్చొని మాట్లాడుదాం.
– హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్నది మూసీ పునరుజ్జీవనం కాదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హామీలను మూలకు పడేసి మూసీని ముందుకు తేవాల్సిన అవసరం ఏమెచ్చిందని నిలదీశారు. మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని, బుల్డోజర్ విధానాలు, రియల్ ఎస్టేట్ దందాలకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. అబద్ధమే ఆశ్చర్యపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే తాము మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా మూసీ నిర్వాసితులకు కూడా గచ్చిబౌలిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితుల వద్ద చర్చకు రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు తాను సిద్ధమని చెప్పారు. ఇప్పుడు రమ్మన్నా కారు తోలుకుంటూ వస్తానని, ఇద్దరమే వెళ్దామని ప్రతి సవాల్ విసిరారు. ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి మాట్లాడిన ప్రతి అంశానికీ తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ మూసీ అంశాన్ని తెచ్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిని రేవంత్‌రెడ్డి దిగజార్చి మాట్లాడారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణలో భాగంగానే తమ హయాంలో 31 ఎస్టీపీలు నిర్మించామని హరీశ్‌రావు గుర్తుచేశారు.
గోదావరి నీటిని రెండు చెరువుల ద్వారా మూసీలో కలిపి పునరుజ్జీవం కల్పించవచ్చని, కానీ, నిర్మాణాలు కాకుండా కూల్చివేతలతో పనులు మొదలు పెట్టారని మండిపడ్డారు. అసలు పని వదిలి శనివారం నదికి ఇరువైపులా కూల్చివేతలకు దిగుతున్నారని, కోర్టులకు కూడా బాధితులు వెళ్లకుండా శత్రుదేశం మీద దాడిచేసినట్టుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిజంగా నల్లగొండ ప్రజల మీద ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని, పరిశ్రమలను ముందు ఫార్మాసిటీ ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.
‘ప్రతిపక్ష బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదంటున్న రేవంత్‌రెడ్డీ.. మరి గుజరాత్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా ఎందుకు రాలేదు?’ అని నిలదీశారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీలను గుర్రాలతో తొకించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అంతకుముందు రేవంత్‌రెడ్డి ఉన్న తెలుగుదేశం పార్టీదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎంత వెకిలి దాడిచేసినా మూసీ బాధిత ప్రజల పక్షాన నిలబడతామని, కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తామని స్పష్టంచేశారు.
నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అద్భుత విన్యాసాన్ని మనమందరం చూశామని, ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారం నాడు కొన్ని హామీలు, వంద రోజుల్లో మరికొన్ని హామీలు అమలుచేస్తామని చెప్పి వాటిని అటకెకించారని మండిపడ్డారు. సీఎం పదవిని దిగజార్చి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ మాటలు వింటుంటే చిన్న పిల్లల సైతం నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవాచేశారు. ‘హైదరాబాద్‌కు మూడు దికుల సముద్రాలు ఉన్నాయని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు.
భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటుందన్నాడు. నగరం మధ్య నుంచి నది ఒక హైదరాబాద్ నగరాల నుంచే పారుతున్నదని అన్నాడు. అనేక నదులు నగరాల మధ్య నుంచి వెళ్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలువదేమో. కావాలంటే ఏ నగరం మధ్యలో నుంచి ఏ నది పోతుందో లిస్ట్ పంపిస్తా చదివి జ్ఞానం పెంచుకో.. సమతా విగ్రహంపై కూడా రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసిండు. స్వయంగా వాళ్ల పీఆర్వోనే మీడియా సమావేశంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు’ అని హరీశ్ గుర్తుచేశారు.
నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ అబద్ధమే ఆశ్చర్యపోయేలా ఉన్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఇది అత్యంత కీలకమైన ప్రెస్‌మీట్ అని, దేశ, రాష్ట్ర ఎకనమీని నిర్దేశించబోయేదని ప్రగల్భాలు పలికారని చెప్పారు. ఆ ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను గ్రాఫిక్స్ హంగులతో ఏఐలో చూపించారని విమర్శించారు. ‘మేము చేస్తున్నది మూసీనది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదు అని ముఖ్యమంత్రి చెప్పిన్రు. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్క్ టైంస్వేర్ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌస్‌ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్ థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టిండు.
ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక దగ్గర వేసి దంచి నూరి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో వేసి తీసినట్టుగా పంచవన్నెల దృశ్యాలు చూపించిండు. నది పునరుజ్జీవనం అంటే సజీవంగా గలగలపారే స్వచ్ఛమైన జలాలు, సుందరీకరణ అంటే మీరు చూపించిన హైటెకులు, అద్దాల ఏఐ బిల్డింగులు. అద్దాల బిల్డింగులు ఉండవంటూనే ఎన్నెన్నో అందాలు చూపించిండ్రు. సీఎం మాట కరెక్టా? కాంట్రాక్టు కంపెనీల కన్సార్షియం చూపించింది కరెక్టా? మీ ప్రజెంటేషన్‌లో రివర్ రిజువనేషన్ అండ్ రివర్‌ఫ్రంట్ అని ఉన్నది. రివర్ రిజువనేషన్ అంటే నదీ పునరుజ్జీవనం. మరి ఈ రివర్‌ఫ్రంట్ ఏందీ? దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏందీ?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
నదుల పునర్జీవన ప్రయత్నం బీఆర్ఎస్ ఎప్పుడో చేసిందని హరీశ్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూ.3,800 కోట్లతో 31 ఎస్టీపీలను మంజూరు చేసి మూసీ నదికి పునర్జీవం పోసే ప్రయత్నం చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.1,100 కోట్లతో ముత్తంగి జంక్షన్ వద్ద గోదావరి నీళ్లను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ద్వారా మూసీ శుద్ధికి ఉపయోగించాలని ప్రణాళిక రూపొందించారని చెప్పారు. గోదావరి జలాలను మూసీ నదికి తెచ్చేందుకు వ్యాపోస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఆర్ కూడా సమర్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా ఆ పనులు చేపట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని మండిపడ్డారు. మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు పేదల ఇండ్లు కులగొడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఏదైనా ప్రాజెక్టును నిర్మాణాలతో ప్రారంభిస్తారు.. కానీ, రేవంత్‌రెడ్డి ఇండ్ల కూల్చివేతలతో మొదలుపెట్టారు’ అని హరీశ్ దుయ్యబట్టారు. శత్రుదేశాల మీద దాడి చేసిన దానికంటే దుర్మార్గంగా పేదలపై దాడి చేసున్నారని విమర్శించారు. రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని బహిరంగ వేదికపై ప్రజల మధ్యలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మాట ఎవరన్నారని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. జూలైలో రేవంత్‌రెడ్డి చెప్పిన ఆ వ్యాఖ్యల వీడియోను మీడియాకు వినిపించారు. ఇంత దిగజారి సిగ్గులేకుండా ఎవరైనా మాట్లాడుతారా? అని నిలదీశారు. మెగాస్టార్లు, సూపర్స్టార్లు కూడా సీఎం నటన చూసి ఆశ్చర్యపోతారని నిప్పులు చెరిగారు. ‘నిషేధించాల్సింది అబద్ధాలు చెప్తున్న రేవంత్‌రెడ్డిని. మూసీ ఫ్రంట్ అన్నది నువ్వే. మూసీ సుందరీకరణ అన్నది నువ్వే. ఇప్పుడు మూసీ పునర్జీవనం అంటున్నది కూడా నువ్వే’ అని దుయ్యబట్టారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటంపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 4000 ఇండ్లు కట్టించి ఇచ్చామని చెప్పారు. ‘ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ గురించి మాట్లాడాడు. నేను చాలెంజ్ చేస్తున్న.. డేట్ మీరు నిర్ణయిస్తారా? నన్ను నిర్ణయించుమంటారా. శనివారం ఉదయం 9 గంటలకు నేను మీ ఇంటికి వస్తా. నేనే కార్ నడుపుకొంటూ మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్లి మూసి బాధితులతో కల్పిస్తా. మేము నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీ చింతచెట్టు కింద మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రజలతో మాట్లాడిస్తా.. రంగనాయకసాగర్ కట్టమీద కూర్చొని మాట్లాడదాం.. రావడానికి నేను సిద్ధంగా ఉన్నా.
మీరు సిద్ధంగా ఉన్నారా?. ముందుగా మూసీ పరీవాహక ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడి వెళ్దాం. అకడ మాట్లాడి అటునుంచి మల్లన్నసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీకి పోదాం. భారతదేశంలో ఇప్పటి వరకు అలాంటి బెస్ట్ ఆర్అండ్ఆర్ కాలనీ ఏ ప్రాజెక్టు కిందా నిర్మించలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు 80 ఫీట్ల రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టి తాళం చేతులిచ్చి ఇండ్ల్లలోకి పంపించినం. ఆర్అండ్ఆర్ కాలనీలకు 250 గజాల్లో ఇల్లు కట్టించింది ఎవరూ లేరు.. ఒక ఇల్లు కాదు 4000 ఇండ్లు కట్టించినం. మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆమెను దేవత అని కీర్తిస్తున్నడు.. మీ దేవత తెచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని గౌరవిస్తున్నవా? 25 లక్షల ప్లాట్లలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇచ్చినం.
ఇండస్ట్రీలు పెట్టి అకడ ఉపాధి అవకాశాలు కల్పించినం. ఆర్‌అండ్‌బీశాఖ వాళ్లు ఎస్టిమేషన్ చేసి పాత ఇంటికి ఖరీదు కడితే దానికి రెట్టింపు చేసి ఇచ్చినం. కుటుంబ యజమాని ఉపాధి కోసం రూ.7.50 లక్షలు ఇచ్చినం. ఇంట్లో 18 ఏండ్లు నిండి పెండ్లి కాని వారి ఉపాధి కోసం మనిషికి రూ.5 లక్షల చొప్పున ఇచ్చినం. అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇల్లు ఖాళీ చేసేందుకు 35 వేల నుంచి 40 వేల డబ్బు ఇచ్చి మరీ పంపించినం. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరికీ 250 గజాల జాగ కూడా ఇచ్చినం. ఈ ముఖ్యమంత్రి ఏమో మొన్న 150 మందికి డబుల్‌బెడ్ రూండ్లు ఇచ్చారు.
ఎవరు కట్టిన డబుల్ బెడ్రూంలు అవి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావు’ అని హరీశ్ ధ్వజమెత్తారు. మూసీగర్భంలో ఉన్న వారి ఇండ్లు కూలకొట్టేశారని, నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. రూ.2000 కోట్లతో మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించామని గుర్తుచేశారు. ఇంట్లో ముసలి వాళ్లు ఉంటే వారికి కూడా ఆర్థికసాయం చేయాలని ఇటీవల కోర్టు తీర్పు వచ్చిందని, అకడ, ఇకడ అలాంటి వాళ్లు మిస్ అయి ఉంటే ఇంకో 100-200 కోట్లు అవుతాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.200 కోట్లు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని సూచించారు.
మూసీ సుందరీకరణ కోసం పేదల ఇండ్లు కూల్చొద్దని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నదీగర్భంలో ఉన్న వారికి కూడా 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని కోరారు. డీపీఆర్ లేకుండా పర్యావరణ అనుమతి లేకుండా పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలా ఇండ్లు కూల్చుతారని నిలదీశారు. ప్రభుత్వ అనుమతి పొంది, పన్నులు చెల్లించి దశాబ్దాలుగా ఉంటున్న ప్రజలు ఆక్రమణదారులు కాదని, రాత్రికిరాత్రే బుల్డోజర్లతో కూల్చిన ప్రభుత్వమే ఆక్రమణదారని మండిపడ్డారు. ఫార్మాసిటీ కొనసాగుతుందని చెప్పి బయట మాత్రం ఫార్మాసిటీని ఫోర్త్సిటీగా ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఫోర్త్‌సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తూ ఫార్మాసిటీని ఖతం పట్టించే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లతో కొండపోచమ్మసాగర్ నుంచి రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తే రెండు చెరువులను దాటి ఉస్మాన్‌సాగర్‌కు అకడి నుంచి హిమాయత్‌సాగర్‌కు వచ్చి అకడ నుంచి మూసీలోకి మంచినీళ్లు తీసుకురావచ్చని చెప్పారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, రేవంత్‌రెడ్డి చేపట్టిన రియల్ ఎస్టేట్ దందాలకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. కోర్టు కేసు గెలవడంతో గచ్చిబౌలిలో 450 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, అందులో నిర్వాసితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూసీ గర్భంలో ఉన్న ఇండ్లను కాకుండా బఫర్‌జోన్‌లో ఉన్న ఇండ్లను కూడా అధికారులు కూల్చుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మూసీ బఫర్‌జోన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు అనేక మంది ప్రముఖుల ఇండ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తాను మూడు నెలలపాటు మూసీ బఫర్‌జోన్‌లో నివాసం ఉంటే ప్రజలకు న్యాయం చేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, పదివేల కుటుంబాల్లో సంతోషం చూసేందుకు పది నెలలైనా మూసీలో ఉండడానికి తాను రెడీ అని చెప్పారు. 15 రోజుల కిందట ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని ముఖ్యమంత్రికి చెప్పామని, కానీ ఇప్పటివరకు పిలువలేదని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్‌రెడ్డి, దేవీప్రసాద్ పాల్గొన్నారు.
ముందు మూసీ ప్రక్షాళన చేయాలని, పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా కట్టడి చేయాలని హరీశ్‌రావు సూచించారు. బాలానగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలల వ్యర్థాలన్నీ హుస్సేన్‌సాగర్ ద్వారా మూసీలో కలుస్తున్నాయని వివరించారు. మూసీని పునర్జీవం తేవాలంటే ముందుగా మూసీలోకి వ్యర్థాలు రాకుండా కట్టడి చేయాలని సూచించారు.
మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. నగరంలోని పరిశ్రమలు అన్నింటినీ ఫార్మాసిటీకి తరలించి మూసీలోకి వచ్చే వ్యర్థాలను తగ్గించవచ్చని చెప్పారు. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిని కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి ముఖ్యమంత్రి ఆటలాడుతున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ వస్తే నగరంలో పొల్యూషన్ తగ్గుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. వాయు, నీటి కాలుష్యాన్ని నివారించి మూసీకి పునర్జీవం పోసే అవకాశం ఉన్నదని చెప్పారు.
నాకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని అంటున్నవ్.. ఆ టైమ్‌లో నువ్వు ఏడున్నవ్?.. బీఆర్ఎస్లో నా శిష్యుడి కింద ఉన్నవ్. నేను మంత్రి అయిన నాడు నా కారు ముందు నాతోపాటు డ్యాన్స్ చేసినోడివి నువ్వు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పారు వద్ద నా వెనుక నిలబడ్డవ్.. నువ్వు చిన్నగ ఉంటవ్, కాబట్టి టీవీలో కనబడేందుకు నికినికి చూసినోడివి నువ్వు.. బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినవ్. బీఆర్ఎస్ మీద నీకు కృతజ్ఞత ఉన్నదా?
– హరీశ్‌రావు