హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముఖ్యమంత్రి సహా ఏడుగురు మంత్రులు హరీశ్‌రావు ప్రసంగానికి 30 సార్లు అడ్డుతగిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న సందర్భంలో హరీశ్‌రావు ఏకాగ్రతను దెబ్బతీసి, సబ్జెక్టు దారి మళ్లించడానికి మంత్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తనకు ఎదురొచ్చిన ప్రతి మంత్రికీ తనదైన శైలిలో హరీశ్‌రావు సమాధానం చెప్తూ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఎండగడుతున్న తీరుకు కాంగ్రెస్ సభ్యులు సైతం మంత్రముగ్ధులై చూస్తుండిపోయారు. చర్చలో హరీశ్‌రావు వేగాన్ని తట్టుకోలేని ప్రభుత్వం సభా వ్యవహారాలకు విరుద్ధంగా మార్షల్స్‌ను ప్రయోగించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చను ప్రారంభించగా, బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించిన హరీశ్‌రావు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆక్షేపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చెత్త రిపోర్టుగా అభివర్ణించారు.
మరుక్షణంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. మీ సభ్యులనే మాట్లాడుమనండి ఉత్తమ్‌కుమార్ చర్చ ప్రారంభించాక, తమ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా హరీశ్‌రావుకు ఇచ్చి ఫేవర్ చేసినట్టు మాట్లాడారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ.. తనకు ఎటువంటి ఫేవర్ అవసరం లేదని, సబ్జెక్ట్ ఉంటే మీ సభ్యులనే మట్లాడుమనండి అంటూ తొలి బౌన్స్ విసిరారు. ఈ బౌన్సర్‌కు కౌంటర్ వేయడానికి మంత్రి మాటలు వెదుక్కోవాల్సి వచ్చింది. మంత్రి దీనస్థితిని గమనించిన సభాపతి కల్పించుకొని మాట్లాడాలని హరీశ్‌రావుకు సూచించడంతో ఆయన తన ప్రసంగం కొనసాగించారు. దేశవ్యాప్తంగా వేసిన కమిషన్లు న్యాయ సమీక్ష ముందు వీగిపోయిన విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావిస్తుండగా.. మళ్లీ శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. కాళేశ్వరంపై చర్చను కొనసాగించాలని, ఇతర అంశాలను ప్రస్తావించడం సరికాదని పేర్కొన్నారు. తాను మా ఉత్తమన్న లాగా ప్రిపేర్ కాకుండా రాలేదని, కాళేశ్వరంపై ఎన్ని రోజులైనా, ఘోష్ కమిషన్ రిపోర్టు మీద ప్రతి అక్షరం మీద మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు సెటైర్ వేశారు. ఈ సెటైర్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహించారు. రూ.లక్ష కోట్లు మింగి సిగ్గు లేకుండా నవ్వుకుంటున్నారని నోరు జారారు. ఉత్తమ్ మాటలకు హరీశ్‌రావు నవ్వుతూనే ప్రతి సమాధానం ఇచ్చారు. ఈ లోగా స్పీకర్ కల్పించుకొని సబ్జెక్ట్ మాట్లాడాలని హరీశ్‌కు సూచించారు. హరీశ్‌రావు స్పీడ్‌ను ఆపడం c వల్ల కాకపోవడంతో ఇక స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి లేచారు. ప్రాణహిత, చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని 2009లోనే కేంద్ర జలవనరులశాఖ, సీడబ్ల్యూసీ స్పష్టం చేసిందని వెల్లడించారు.