సంగారెడ్డి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలవనున్నారు. ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పినా ప్రభు త్వం నిరంకుశంగా భూసేకరణకు సిద్ధమవుతుండటంతో రైతులకు బాసటగా నిలిచి వారి ఆందోళనలో పాల్గొనేందుకు హరీశ్‌రావు గురువారం న్యాల్కల్ మండలం డప్పూరుకు రానున్నారు. డప్పూరులో భూములు కోల్పోతున్న మూడు గ్రామాల రైతులతో సమావేశమై ము ఖాముఖిగా మాట్లాడనున్నారు. సమస్యలు తెలుసుకోవటంతోపాటు ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూములను పరిశీలించనున్నారు.
హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ వెళ్లనున్నారు. మండలంలోని పచ్చని పల్లెలను కాలుష్య కాసారాలుగా మార్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభు త్వం పూనుకున్నది. డప్పూరు, వడ్డీ, మాల్గి గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు గ్రామాల పరిధిలో పేద రైతులు, దళితుల నుంచి 1983 ఎకరాల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నది.
భూసేకరణ కోసం ఆ గస్టు 21, 23న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫార్మాసిటీ కోసం 1983 ఎకరాల భూమి సేకరించనుండగా ఇందులో 1070 ఎకరాల పట్టాభూమి, 912 ఎకరాల అసైన్డ్భూమి ఉంది. 1070 ఎకరాల పట్టా భూములు కోల్పోతున్న రైతులు, 912 ఎకరాల అసైన్డ్ భూములు కోల్పోతున్న దళిత పేద రైతులు ఫార్మాసిటీకి భూములు ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్య కారకాలు మంజీరా నదిలో చేరి నది అంతా కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందని న్యాల్కల్ రైతులతోపాటు జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.