సంగారెడ్డి జూలై 28 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్‌రెడ్డి లాలూచీ పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని, ఈ ఘటనలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యి కంపెనీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిగాచి ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం దక్కలేదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎక్కే విమానం..దిగే విమానం తప్ప సిగాచి పరిశ్రమపై ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు.
నెల రోజులైనా సిగాచి పరిశ్రమ బాధితులకు నష్టపరిహారం దక్కకపోవడం, మృతదేహాలను కూడా కుటుంబాలకు ఇవ్వకపోవడంపై బాధితుల తరఫున బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మాజీ మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో సిగాచి పరిశ్రమ బాధితులు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మల్కపురం శివకుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి తదితరులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల దాటినా బాధితులను ఆదుకోకపోవడం, మృతదేహాలను కూడా బాధిత కుటుంబాలకు అప్పగించకపోవడం, రూ.కోటి నష్టపరిహారం ఇవ్వకపోవడం తదితర అంశాలపై నిలదీశారు.
అనంతరం కలెక్టరేట్లో హరీశ్ విలేకరులతో మాట్లాడుతూ సిగాచి ఘటనపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తున్నదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన కోటి పరిహారం ఎవరిస్తారు? ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘బాధితులు తమ వారి శవాలు అప్పగించాలని అడిగితే.. కొందరి శవాలను నూనె అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి పంపిండ్రు, మరికొందరికి బూడిద తీసుకెళ్లండని వెటకారంగా స్థానిక అధికారులు, కంపెనీ యాజమాన్యం చెప్పడం అమానవీయం.
ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు శవాలు కూడా దొరకలేదు.. సిగాచిలో చనిపోయినవారి బూడిదైనా దొరకింది, బుడిద దొరికినందుకైనా సంతోషించండని బాధ్యత ఉన్న అధికారులు, కంపెనీ ప్రతినిధులు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ అంటూ మండిపడ్డారు. ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ కార్మికులు, తొమ్మిది మంది ఆంధ్రాకార్మికులు, 43 మంది ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, ఒడిశాకు చెందిన కార్మికులు చనిపోయారని, తమవారిని కోల్పోయి మనోవేదన పడుతున్న బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పటికీ అందకపోవడం బాధాకరమని వాపోయారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెంటనే అరెస్టులు చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు, 54 మంది మృతికి కారకులైన సిగాచి యాజమాన్యంపై మర్డర్ కేసు ఎందుకు పెట్టడం లేదు? ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని బిల్డప్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదు?
-హరీశ్‌రావు
‘రాష్ట్రంలో బాధ్యతారహిత పాలన నడుస్తున్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే, ముఖ్యమంత్రిని విమర్శిస్తే కేసులు పెట్టి వేధించే ప్రభుత్వం.. 8 మంది గల్లంతుకావడానికి కూడా కారణం. మరి ప్రభుత్వంపై చర్యలుండవా? ప్రభుత్వంపై కేసులు పెట్టరా?’ అని హరీశ్ నిలదీశారు. 54 మంది మృతికి కారణమైన సిగాచి కంపెనీపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని వెళ్లి చేపల కూర తిన్నారని, హెలికాప్టర్లు వేసుకొని వెళ్లారు తప్ప డెడ్‌బాడీలను తీసుకురాలేదని దుయ్యబట్టారు. డేట్లు మారాయి తప్ప డెడ్‌బాడీలను ప్రభుత్వం తేలేకపోయిందని ఎద్దేవాచేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 150 రోజులైనా ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. అసలు ఆ సొరంగంలో ఉన్నవారు బతికున్నారో.. చనిపోయారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదని చెప్పారు. ‘సిగాచిలో 54 మంది ప్రాణాలు పోతే శవాలు ఇవ్వలేదు.. కనీసం బూడిద, బొక్కలు కూడా ఇవ్వలేదు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని నిప్పులు చెరిగారు.
బాధితుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని, నెల గడిచినా పరిహారం ఇవ్వలేదని, ఎప్పుడిస్తారో ఇప్పటికీ ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం చెప్పడం లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 లక్షలు, పాక్షికంగా గాయపడ్డవారికి రూ.25 లక్షలకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డెత్ సర్టిఫికెట్లు, పంచనామా కాపీ, ఎఫ్ఐఆర్లను కలిపి ఒకేసారి కుటుంబసభ్యులకు ఇవ్వాలని, గతంలో సంగారెడ్డిలో ఇదే తరహా ప్రమాదం జరిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నష్ట పరిహారంతోపాటు డెత్ సర్టిఫికెట్, పంచనామా కాపీ, ఎఫ్ఐఆర్లను కలిపి ఒకేసారి అందజేసిందని గుర్తుచేశారు. గాయపడ్డవారికి తక్షణం రూ.10 లక్షలిస్తామని సీఎం చెప్పారని, కేవలం రూ.50 వేలిచ్చి చేతులు దులుపుకొన్నారని, గాయపడ్డవారికి రూ.50 లక్షలు ఇవ్వడంతోపాటు నెలనెలా జీతాన్ని కూడా ఇవ్వాలని, చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వలసకార్మికులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడి తెలంగాణ గౌరవాన్ని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తే సీఎం రేవంత్‌రెడ్డి సిగాచి ఘటనలో చనిపోయిన వలసకార్మికుల శరీర భాగాలను నూనె అట్టపెట్టెల్లో పెట్టి బాధిత కుటుంబాలకు అప్పగించి రాష్ట్ర గౌరవాన్ని మంటగలిపారని హరీశ్ మండిపడ్డారు. వలస కార్మికుల మృతదేహాలను బాధిత కుటుంబాలకు సగౌరవంగా అప్పజెప్పాల్సిన ప్రభుత్వం నూనె డబ్బాల్లో పెట్టి ఇచ్చిందని నిప్పులు చెరిగారు. వలసకార్మికులు రాష్ట్ర, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములని కేసీఆర్ నాడు ప్రకటించారని, కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక రైళ్లు, భోజనాలు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారని గుర్తుచేశారు.
కేసీఆర్‌ను చూసి నేర్చుకో
ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించే తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని హరీశ్ హితవుపలికారు. కరోనా వంటి మహమ్మారితో ప్రజలు ఇబ్బందిపడుతున్నప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చూపించిన చొరవను చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని చెప్పారు. జార్ఖండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ర్టాలకు వెళ్లే కూలీల కోసం ప్రత్యేకంగా రైళ్లు, భోజన వసతులు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులని కేసీఆర్ చెప్పారని, అదే రేవంత్‌రెడ్డి సిగాచి కార్మికుల శవాలను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి పంపి రాష్ట్ర గౌరవాన్ని మంటగలిపారని నిప్పులు చెరిగారు. ఢిల్లీ వెళ్లడం.. రావడం తప్ప సిగాచిపై ఒక్క సమీక్ష చేయలేదని విమర్శించారు.
‘సిగాచి పరిశ్రమ ప్రమాదంపై కమిటీ వేస్తున్నట్టు ఆర్భాటంగా సీఎం ప్రకటించిండ్రు. నెల రోజులైనా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చినా ప్రభుత్వం బయట పెట్టడం లేదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. కంపెనీ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారని, అలాంటిది కంపెనీపై ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. పాత యంత్రాలతోనే ప్రమాదం జరిగిందని, నేరపూరిత నిర్లక్ష్యంతో ఉన్న కంపెనీపై సీఎంకు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.
సిగాచి ఘటనపై అసలు ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు అధికారిక ప్రకటన చేయలేదు? ఎంత మందికార్మికులు చనిపోయారు? ఎంత మంది గాయపడ్డరు? ఎంతమంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిండ్రు? ఎంత మంది క్షతగాత్రులకు ఆర్థిక సహాయం చేశారనే వివరాలను ఎందుకు వెల్లడించలేదు? ఈ ప్రమాదంపై ఎందుకు గోప్యత పాటిస్తున్నరు?
-హరీశ్‌రావు
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో 2024, ఆగస్టు 20న ఓ కంపెనీలో బ్లాస్టింగ్ జరిగి 17 మంది చనిపోతే అక్కడి ప్రభుత్వం 3 రోజుల్లో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించింది. సిగాచి ఘటనలో 54 మంది చనిపోయి నెలరోజులైనా రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది.
-హరీశ్‌రావు
‘హరీశ్‌రావు అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అంత హడల్ ఎందుకు’ అని హరీశ్ ప్రశ్నించారు. సిగాచి బాధిత కుటుంబాలతో కలిసి తాను సోమవారం కలెక్టర్‌ను కలుస్తానని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఆదివారం నుంచి బాధిత కుటుంబాలకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారని, హరీశ్‌రావు వద్దకు వెళ్లకండి.. మీకు పరిహారం త్వరగా అందేలా చూస్తామని బతిమిలాడారని చెప్పారు. బాధిత కుటుంబాలు వారి మాటలను నమ్మలేదని, తనవెంటే వచ్చి అదనపు కలెక్టర్‌కు తమ కష్టాలను చెప్పుకున్నారని తెలిపారు.
కాగా హరీశ్ సిగాచి బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్‌కు వస్తున్న విషయం తెలిసి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. హరీశ్‌రావును, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ గేటు వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చివరికి హరీశ్ కలుగజేసుకోవడంతో ముఖ్య నాయకులను కలెక్టరేట్‌లోకి అనుమతించారు. కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిగాచి పరిశ్రమలో తమవారిని కోల్పోయిన వారు నెల రోజులుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ, పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఈ విషయం మాజీ మంత్రి హరీశ్ దృష్టికి వెళ్లింది. సోమవారం హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కదిలివచ్చి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకొని బోరుమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము ఇంకెంత కాలం ఇక్కడ ఉండాలో తెలియడంలేదని, రోజూ వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని వాపోయారు. తమ వారి ఫ్లెక్సీలతో కొందరు, శరీర భాగాలు అట్టపెట్టెల్లో పెట్టి ఇచ్చారని మరికొందరు ఆ ఫొటోలను హరీశ్‌కు చూపించి కన్నీరుమున్నీరయ్యారు.