సంగారెడ్డి జూన్ 30 (నమస్తే తెలంగాణ): సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన అనంతరం సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు తెలిపారు. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులు ఆయనను అడ్డుకోబోగా, సహాయక చర్యలకు ఎలాంటి అంతరాయం కలిగించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితకుటుంబాలు, క్షతగాత్రులకు అండగా నిలవడంతో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
పేలుడు ఘటనలో 12 మంది కార్మికులు మృతిచెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారంగా ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతులు, క్షతగ్రాతుల సంఖ్యలో కలెక్టర్, ఎస్పీ చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదని మండిపడ్డారు. తనకున్న సమాచారం ప్రకారం పేలుడు సమయంలో కంపెనీలో 140 మంది ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమతోపాటు అడ్మినిస్ట్రేషన్ భవనం కూలిపోయిందని తెలిపారు. 12 మంది మృతి చెందగా 26 మంది క్షతగాత్రులను దవాఖానలకు తరలించినట్టు చెప్పారు. మిగతా వారి పరిస్థితి తెలియడం లేదని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే కార్మికశాఖ, ప్రభుత్వం ఏమి చేస్తున్నదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. క్షతగాత్రులను ఇస్నాపూర్, చందానగర్ దవాఖానలకు తరలించడంపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానలకు తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
కార్మికుల కుటుంబాలకు భరోసా
పాశమైలారం క్షతగాత్రుల కుటుంబాలకు మాజీ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కంపెనీ ఎదుట రోదిస్తూ కూర్చున్న అనితను ఓదార్చారు. తన భర్త శివాజీకుమార్ వివరాలు తెలియడం లేదని అనిత హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు. ఇదే పరిశ్రమలో పనిచేసే తన తండ్రి గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని బీహార్‌కు చెందిన రాకేశ్ రోదిస్తూ తెలిపాడు. మరో మహిళ మల్లేశ్వరి కూడా తన భర్త బాలకృష్ణ జాడ తెలియలేదని మాజీ మంత్రి హరీశ్‌రావుకు మొరపెట్టుకుంది. దీంతో ఆయన అధికారులతో మాట్లాడి ప్రమాదంలో కార్మికుల వివరాలను బాధిత కుటుంబసభ్యులకు తెలపాలని సూచించారు. పటాన్‌చెరువులో ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఫోన్లో కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడి, పరిస్థితి విషమంగా ఉన్న వారిని పెద్ద దవాఖానలకు తరలించాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదరతో ఫోన్లో మాట్లాడేండుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్ కలవలేదు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీలు చంటి క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, కే సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాణిక్యం, శివకుమార్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌గౌడ్ తదితరులు ఉన్నారు.