హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా వారికి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, 2014లోనే వారి వేతనాన్ని రూ.9,000 నుంచి రూ.27,600 కు పెంచిందని గుర్తుచేశారు. ట్రాఫిక్‌లో విధు లు నిర్వహించే వారికి 30% రిస్ అలవెన్స్ ఇచ్చిందని తెలిపారు. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మగౌరవం పెంచిందని పేర్కొన్నారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల కోసం 600 కోట్లకుపైగా ఖర్చు చేసిందని తెలిపారు.
హోంగార్డుల సంక్షేమం గాలికి
రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉన్న హోంగార్డుల బతుకులను రోడ్డు పాలు చేసిందని మండిపడ్డారు. రెండేండ్ల కాలంలో 60 మందికిపైగా హోంగార్డులు చనిపోయారని, వారిలో రోడ్డు ప్రమాద మృతులకు తప్ప ఇతరులకు రూ.5 లక్షల పరిహారం అందించలేదని తెలిపారు. కారుణ్య నియామకాలు జరుపకపోవడం, ఎక్స్‌గ్రేషియా అందించకపోవడంతో హోంగార్డుల కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదురొంటున్నాయని పేర్కొన్నారు. హోంగార్డుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని, కారుణ్య నియామకాలు జరుపుతామని, హెల్త్ కార్డులు, వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని హామీలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటివరకు వాటిలో ఒకటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మరిచిన హామీలు
గత జనవరిలో జీవో-2 జారీచేసి, సహజ మరణం పొందిన హోంగార్డులకు రూ.5 లక్షలు, హెల్త్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఇప్పటివరకు అవి నెరవేరలేదని హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మినహా రాష్ట్రమంతటా హోంగార్డులకు నాలుగేండ్ల నుంచి యూనిఫాం అలవెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కారుణ్య నియామకాలు కలగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటికైనా హోంగార్డులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వారి సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు.