సిద్దిపేట, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలోని ప్రజలు ఆరుగ్యారెంటీలపై నిలదీస్తుంటే భరించలేక సీఎం రేవంత్‌రెడ్డి కేరళకు పారిపోయిండు. ఆరుగ్యారెంటీలు అమలైపోయాయని, కావాలంటే తెలంగాణకు వచ్చి చూసుకోవచ్చని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దొంతుల సురేశ్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ సీనియర్ నాయకుడు పాషాతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా చేసిందేమీలేదు కానీ, కేసీఆర్ తెచ్చిన పథకాలను ఒకొకటిగా బంద్ చేస్తున్నారని విమర్శించారు.
బతుకమ్మ చీరలు, కేసీఆర్‌కిట్, బీసీబంధు, మైనారిటీబంధు, గొర్రెలపంపిణీ, చేపపిల్లల పంపిణీ.. తదితర పథకాలన్నీ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు గ్యారంటీల్లో మొదటిదైన మహాలక్ష్మీ కింద అకాచెల్లెళ్లకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు.. ఒక రూపాయైనా ఖాతాల్లో పడిందా..? అని ప్రశ్నించారు. అవ్వా..తాతలకు రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ కింద ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? అని ప్రశ్నించారు. పేదలకు కనీసం నీళ్లను ఫిల్టర్ చేసి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేశారు. అమీన్పూర్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శని, ఆదివారాల్లో పేదల ఇండ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. హైడ్రాను తెచ్చింది పేదల బతుకులు ఆగం చేయడానికా.. అని నిలదీశారు?
బీజేపీ, కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్లోకి రావడం సంతోషకరమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు, మోదీ, రేవంత్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు.