ఇవి గవర్నమెంట్ భూములేనని సుప్రీంకోర్టులో ఆర్డీవో ఫైల్ చేశారని పొంగులేటి చెప్పిండ్రు. గవర్నమెంట్ భూములే అయితే బోర్డులపై కోహినూర్, ఎంఈఐఎల్, శిల్ప, ఏక్యూ స్కేర్ ఇట్ల పేర్లెందుకు మారుతున్నయ్? అక్కడ బౌన్సర్లు రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా? రెండున్నరేండ్లుగా రెవెన్యూ మంత్రి ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలే? ఏక్యూ స్కేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నది నిజం కాదా? డాక్యుమెంట్లు బయట పెడుదామా?
– హరీశ్‌రావు
వనపర్తి, ఏప్రిల్ 9 : ‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నది! చిత్తశుద్ధి ఉంటే అక్కడ కాంపౌండ్ వాల్స్ తొలగించి, బౌన్సర్లు, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టి భూమిని స్వాధీనం చేసుకొండి. ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పొగరు తగ్గించుకోవాలని.. ఆయన పొంగులేటి కాదు, పొంగులూటీ అని దెప్పిపొడిచారు. రెవెన్యూ శాఖ మంత్రి నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ‘అంబేద్కర్ సచివాయంలో పొగరులేటి మాటలు విన్నం.. ఓవైపు అంబేద్కర్, మరో వైపు ఆలయం, మసీదు ఉండగా నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడిండ్రు. రాఘవ సంస్థను, తన కొడుకును ఈ ఉచ్చులోంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. తానొక్కడే కాదు.. మంత్రులు జూపల్లి, మల్లు భట్టి విక్రమార్క కూడా భాగస్వాములని పొంగులేటి స్వయంగా బయటపెట్టారు’ అని గుర్తుచేశారు.

‘నాదర్గుల్ భూముల విషయంలో బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిందని ఓ చిల్లర కథ చెప్తున్నవ్. 2016లో నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కంపెనీలు భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఆనాటి ఆర్డీవోతో 2016లో 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను కాపాడింది. ఆ తర్వాత కంపెనీలు హైకోర్టుకు పోతే.. 2022లో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి ఆర్డీవో నిర్ణయం సరైంది అని, ఇవి సీలింగ్ భూములు అని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు తెప్పించినం. డివిజన్ బెంచ్‌లో ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వాదనలు వినిపించి సీలింగ్ భూములు అమ్మిన వారిపై, కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా తీర్పు చెప్పింది’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘ఈ భూములు ప్రభుత్వ భూములని, సుప్రీం కోర్టులో కేసు వేశామని చెప్తున్న మీరు రోజుకో పేరుతో కోహినూర్, శిల్ప, ఏక్యూ స్కేర్ బోర్డులు మారుస్తున్నారు. ప్రభుత్వ భూమిగా గుర్తించినప్పుడు రెండున్నరేండ్లయినా హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదు? హైడ్రా ఎక్కడికి పోయింది? గడ్డి పీకుతున్నదా? పేదల ఇండ్ల మీదికి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లే హైడ్రా, ఈ ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?’ అని నిలదీశారు.

‘నీ బాంబులన్నీ తుస్సు బాంబులే. నీ మాటలు విన్న తర్వాత ప్రజలకు పొగరులేటి మంత్రి అని అర్థమైంది. ఇంకా చాలా ఉన్నయ్ బయటకు వచ్చేవి. ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నవ్.. కానీ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నది. హైడ్రాను పంపించు.. కాంపౌండ్ వాల్స్ తొలగించి.. ఆక్రమణదారులను అరెస్టు చేసి గవర్నమెంట్ భూమి అని బోర్డు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకో’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు పొంగులేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యా దవ్, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
‘ఇంకా చాలా ఉన్నయ్ నీ విషయాలు బయటకు రావాల్సినయ్.. శాసనసభలో మీ ముఖ్యమంత్రే లేచి ‘ఏ ఇది ప్రతిపక్షం దొరకవట్లే.. ఈ దొంగతనం మేమే దొరుకవట్టినం.. మేమే నోటీసులిచ్చినం.. మేమే పెనాల్టీ వేసినం’ అని చెప్పినప్పుడు నువ్వు పక్కనే కూర్చున్నవు కదా? ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎం దుకు లేచి నిలబడి చెప్పలే? మీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతుల్లేవు.. అనుమతుల కోసం ఢిల్లీకి ఐప్లె చేసిందని చెప్తే.. రాఘవకు మైనే లేదని నువ్వు ఎందుకు లేచి చెప్పలే? నా పక్క సీట్లనే కూర్చున్నవు కదా? మరి ఆరోజు ఎందు కు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని?’ అని హరీశ్‌రావు నిలదీశారు. ‘ఆ మైన్ నీది కాకకపోతే అక్కడ కంటెయినర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పేరెందుకున్నది? ఆ కంటెయినర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ బయటకు తీయంగనే ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ బోర్డు మీద కనవడకుండా పెయింట్ ఎందుకు వేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పీకేసిండ్రు సమాధానం చెప్పాలెగద నువ్వు’ అని ప్రశ్నించారు. ‘మైనింగ్ మంత్రి, రెవెన్యూ, విద్యుత్తు, పీసీబీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినట్టు చెప్పిండ్రు. రాఘవ క్రషర్కు ఇచ్చిన నోటీసులు తప్పా? లేక బాంబులేటి.. పొగరులేటి చెప్పింది తప్పా?’ అని నిప్పులు చెరిగారు.