High Court | ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద్ధ డెక్కన్ కిచెన్ ప్రాపర్టీ వివాదంలో టాలీవుడ్ ప్రముఖులు వెంకటేష్, సురేష్ బాబు, రాణా, డి. అభిరామ్ మరియు వారి అకౌంటెంట్ గడ్డం విశ్వనాథమ్లకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లిలోని XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ కొట్టేశారు.
లీజు గడువులో ఉన్న తమ ప్రాపర్టీలోకి నిందితులు జీహెచ్ఎంసీ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ప్రవేశించారని, అక్కడ తాము నిర్మించిన నిర్మాణాలను బలవంతంగా కూల్చివేశారని, విలువైన చరాస్తులను తొలగించడంతో పాటు తమ కుటుంబాన్ని బెదిరించారని కోరె నందు కుమార్ అనే వ్యక్తి గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం పూర్తిగా లీజు హక్కులు, ఆక్రమణలు మరియు నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన సివిల్ వివాదమే తప్ప క్రిమినల్ కేసు కాదని, తమపై నమోదు చేసిన చార్జ్‌షీట్‌ను రద్దు చేయాలని కోరుతూ 2024లో నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి చట్టబద్ధమైన అధికార పరిధిని ఉపయోగించి జోక్యం చేసుకునేందుకు ఎలాంటి బలమైన కారణాలు కనిపించలేదని స్పష్టం చేసిన హైకోర్టు, వారి పిటిషన్‌ను తిరస్కరించింది.