హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిన మేలు కంటే.. సృష్టించిన విధ్వంసమే ఎకువని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో విద్యార్థులు పడుతున్న గోసపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? అని ప్రశ్నించారు. ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు పూర్తయినా.. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చికుకున్నాయని పేర్కొన్నారు.
ఒకప్పుడు రాష్ట్రంలో సుమారు 960 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 650కి పడిపోయిందని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు మూతపడే ప్రమాదం ఉన్నదని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కళాశాలలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

దీంతో ఉద్యోగాలకు వెళ్లలేక.. పైచదువులకు చేరలేక వారి భవిష్యత్తు అంధకారంలో పడితే బాధ్యత ఎవరిదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో కలిపి రూ.19,500 కోట్లు చెల్లించారని తెలిపారు. సిద్దిపేటలోని శ్రీకృప కాలేజీ విద్యార్థులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ రాయ్‌దుర్గ్ ప్రాంతంలోని చారిత్రక జామియా నిజామియా వక్ఫ్ భూముల పరిరక్షణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. రాయ్‌దుర్గ్ వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ కన్వీనర్ అబ్దుల్ వాహబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కలిసింది. అత్యంత విలువైన వక్ఫ్ భూములను రేవంత్ సర్కార్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భూముల పరిరక్షణపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని జేఏసీ నేతలు కోరారు.
వారి విజ్ఞప్తిపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. భూముల పరిరక్షణ కోసం జేఏసీ ఈ నెల 13న హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ ధర్నాకు మద్దతిస్తున్నట్టు హరీశ్‌రావు వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టే ఈ నిరసన పోరాటంలో తమ శ్రేణులు భాగస్వామ్యమవుతాయని ఆయన పేరొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్, టీఎస్ఎంహెచ్ పీఎస్ రాష్ట్ర సమన్వయకర్త అబ్రార్ హుస్సేన్, ఎస్ డీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ షా, టీఎస్ఎంహెచ్ పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ వాజిద్, వక్ఫ్ ప్రొటెక్షన్ సెల్ నేత నయీముల్లా షరీఫ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన 22ఏ నిషేధిత జాబితాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. సరూర్‌నగర్ మండలం రోషన్ఉద్దౌలా పరిధిలోని సర్వే నంబర్లు 27, 28, 29, 39, 47లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంపై ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. 2026 జూన్ లో హైకోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఆమోదయో గ్యం కాదని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన యూఎల్సీ ప్రొసీడింగ్స్ ముగిశాయ ని, భూమి స్వాధీనం చట్టబద్ధంగా జరుగలేదని హైకోర్టు తేల్చిచెప్పిందని అన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ డాటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడం దుర్మార్గమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తగిన జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా 22 ఏండ్లుగా సేవలందిస్తున్న డీఈవోలను రోడ్డున పడేయడం న్యాయమా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుభవం, సేవలు, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఉద్యోగాల నుంచి తొలగించడానికి బదులు ఇతర ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.