సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ పదేండ్ల కృషికి నిదర్శనం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందించాలని ఎంతో చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కడితే తామే కట్టినట్టు కాంగ్రెస్ వాళ్లు కటింగ్‌లు ఇస్తున్నరు. ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులు పోటీ పడి మరీ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నరు.
Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కృషి ఫలితమేనని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. సీతారామ క్రెడిట్‌ను కొట్టేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతున్నదని, కాంగ్రెస్ మంత్రులకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశంవస్తే, ప్రాజెక్టునే కట్టినట్టు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 90శాతం పూర్తిచేసింది.. దాన్ని కేవలం ప్రారంభించేది మాత్రమే మీరు’ అంటూ దుయ్యబట్టారు. సీతారామ ద్వారా ఖమ్మం జిల్లాలో రెండు పంటలకు పుష్కలంగా నీళ్లందుతాయని, సాగు, తాగునీటి సమస్య ఉండదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నేత దిండిగల రాజేందర్‌తో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్ మంత్రులు పోటీ పడి మరీ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారని, మంత్రుల కంటే తానేం తక్కువ అన్నట్టుగా ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని దెప్పిపొడిచారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైనదని, పదేండ్ల కృషి అని గుర్తుచేశారు. ఆ ఫలితాలు, విజయాలను తమవిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పడుతున్న అపసోపాలు, సర్కారు పడుతున్న ఫీట్లను చూస్తుంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవాచేశారు. ఖమ్మం జిల్లా కరువు బాధలను తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టుకు సంకల్పం చేసింది కేసీఆర్ అని, పవిత్రమైన ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అది శరవేగంగా పూర్తికావాలని సీతారామ అని పేరుపెట్టారని గుర్తుచేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నికష్టాలు అధిగమించి పట్టుదలతో పూర్తి చేసిందని చెప్పారు. ‘ఈ రోజు మీకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్టి కటింగ్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటరు.. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకొనేటోళ్లను పరాన్నజీవులు అంటరు’ అంటూ హరీశ్ ఎద్దేవాచేశారు.
‘ప్రారంభించిన మూడు పంపుహౌస్ పనుల్లో పది పైసల పనైనా మీరు చేశారా? ప్రాజక్టు కట్టాలంటే డిజైన్, భూ సేకరణ, అనుమతులకు ఏండ్లు పడుతుంది. మీరు ఏడు నెలల్లోనే పూర్తిచేశారా?’ అంటూ హరీశ్ నిలదీశారు. ప్రాజెక్టు వద్దకు రోజుకో మంత్రి వెళ్తున్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడుతున్నారని, జనం వారిని చూసి నవ్వుకుంటున్నారని, సీతారామ ప్రాజెక్టు కథ కూడా 30 వేల ఉద్యోగాల తీరులానే ఉన్నదని ఎద్దేవాచేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసింది. నిజాలు చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. నాడు కేసీఆర్ నిజాలు చెప్పారు. నిండు శాసనసభలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ పథకాలను కొనసాగిస్తామని చెప్పిండ్రు. ఆ ధైర్యం, సంస్కారం మాకు ఉన్నది. కాంగ్రెస్ నాయకులు మాత్రం పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు, ఫొటో ఉన్నదని పేజీలను చింపించిండ్రు. మేము కట్టిన ఫె్లై ఓవర్లు, ప్రాజెక్టులను ప్రారంభిస్తూ, మేము తెచ్చిన బస్సులకు జెండాలూపుతూ, మేం అమలు చేసిన పథకాలకు చెకులు పంచుతూ కాలం గడపుతున్నరు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటైనా నిర్మాణాత్మక అడుగు పడిందా’ అంటూ నిలదీశారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అంటున్నారు.. మీ తండ్లాట, మీ తాపత్రయమే నీ నైతిక పతకానికి సంకేతం. కేసీఆర్ చేసిన పనులను తమవిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్సోళ్లు పడుతున్న తపనే మా నైతిక విజయానికి నిదర్శనం’ అని హరీశ్ స్పష్టంచేశారు.
ఇందిరమ్మ సాగర్ ప్రాజెక్టుకు 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కనీసం అనుమతులైనా తెచ్చిందా? నీటి కేటాయింపులు చేసిందా? భట్టి విక్రమార అప్పుడు కూడా క్యాబినెట్ హోదాలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నడు కదా? ఇప్పుడు వచ్చి 75 కోట్లతో సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామంటున్న ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వచ్చు..
సీతారామ క్రెడిట్ కేసీఆర్‌దే అన్న మంత్రి తుమ్మల ఇప్పుడు అదేమాటను గుండెలపై చెయ్యేసుకొని చెప్పాలని హరీశ్ సూచించారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల అని, కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారని గుర్తుచేశారు. ‘రాజీవ్, ఇందిరాసాగర్లలో మీరు మూడు వేల క్యూసెక్కుల సామర్థ్యం పెడితే కేసీఆర్ 9 వేల క్యూసెకులకు పెంచిండ్రు. ఈ ప్రాజెక్టుల్లో మీరు కొన్ని మండలాలు, కొన్ని నియోజకవర్గాలను వదిలేసిండ్రు. కృష్ణా జలాలు ఆలస్యమై ఖరీఫ్ పంట వేసే అవకాశం ఉండకపోయేది. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాకే గోదావరి జలాలు ఏనాడూ అందలేదు. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరందించేలా ప్రాజెక్టును కేసీఆర్ రూపొందించిండ్రు.’ అని గుర్తుచేశారు. సీతారామ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీల్లో ఐదు తాము పూర్తి చేశామని, మిగతా మూడింటిలో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మోటర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో పూర్తయిందని వివరించారు. మొత్తంగా 90 శాతం ప్రాజెక్టును తాము పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్లు పూర్తిచేసినట్టు చెప్పుకొంటున్నారని ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పేరే సీతారామ అని, రాముడు సత్యవాక్పరిపాలకుడని, సత్యానికి, ధర్మానికి ప్రతిరూపమని, ఆయన పేరుతో కట్టిన ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్తే భగవంతుడు కూడా క్షమించడని మండిపడ్డారు.
మూడు పంపుహౌసుల్లో పది పైసల పనైనా చేశారా? డిజైన్, భూ సేకరణ, అనుమతులను మీరు ఏడు నెలల్లోనే పూర్తిచేసి ప్రాజెక్టును కట్టిండ్రా? మేం అమలు చేసిన పథకాలకు చెకులు పంచుతూ కాలం గడపుతున్న మీరు, ఈ ఎనిమిది నెలల్లో ఒక్క నిర్మాణాత్మక అడుగైనా వేశారా?
-హరీశ్‌రావు
హైడ్రాలజీకి 2023 ఏప్రిల్ 3న, ఇతర రాష్ర్టాల అనుమతులు 2023 జూలై 6న వచ్చాయని, 67.05 టీఎంసీల నీటి కేటాయింపులకు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయని హరీశ్‌రావు తెలిపారు. ఇందిరమ్మ సాగర్‌కు కాంగ్రెస్ 2005 నుంచి 2014 వరకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదని, నీటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. భట్టి విక్రమార అప్పుడు కూడా క్యాబినెట్ హోదాలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టును తాము రైతుల అవసరాల కోసం రీడిజైన్ చేశామని చెప్పారు. గతంలోని ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ కంటే వరప్రదాయిని అని, ఆయకట్టును మూడు లక్షల ఎకరాల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెంచామని, పది పంపింగ్ స్టేషన్లు ఉండేవని, ఎక్కువ పంపింగ్ స్టేషన్లు ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయని నాలుగుకు తగ్గించామని, 27 నుంచి 67 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. బ్యారేజీలో 1.2 టీఎంసీల సామర్థ్యం ఉంటే దానిని 36 టీఎంసీలకు పెంచుకున్నామని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ తదితర ప్రాంతాలకు ఆయకట్టు విస్తరించామని, డోర్నకల్, మహబూబాబాద్‌కు కూడా విస్తరించామని వివరించారు. మూడు వేల చెరువులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులను కేసీఆర్ తీసుకొచ్చారని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారని గుర్తుచేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ అనుమతులు కూడా తెచ్చామని చెప్పారు. గోదావరి నీళ్లు పాలేరు దాకా వస్తాయని, అకడ రివర్స్ పంపింగ్ చేస్తే నల్లగొండ జిల్లాకు కూడా నీళ్లు వస్తాయని, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్ వాటర్ ద్వారా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టుకు కూడా సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను అందించేలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఎంతో ముందుచూపుతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును ప్రతిపాదించారని గుర్తుచేశారు. పాలేరు, వైరా, లంకసాగర్ రిజర్వాయర్లకు ఢోకా ఉండదని, 3.40 లక్షల ఎకరాల సాగర్ అయకట్టును స్థిరీకరరించే ప్రయత్నం చేశామని తెలిపారు.
‘మీ పరిపాలన ఆగమాగమైంది.. రాష్ట్రంలో పాలన పడకేసింది.. అంతా గందరగోళంగా మారింది’ అంటూ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఎనిమిది నెలల బాబు కూడా డెంగ్యూతో చనిపోయాడని, మూడు వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు. పసికందులను కుకలు పీకుతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అసిఫాబాద్ జిల్లా గండిపేటలో కాశీనాథ్, పూజఅనే అమ్మాయి కూడా విషజ్వరంతో చనిపోయారని, వేలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని ఆందోళనచెందారు. సర్పంచ్‌లే కాదు పంచాయతీ సెక్రటరీలను కూడా అప్పుల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అంటూ ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో కార్యదర్శులు అప్పులపాలైన ఘనత లేదని, తన నియోజక వర్గానికి దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు వస్తే పంచాయతీల్లో నెలకొన్న దుస్థితిని చూపిస్తానని హరీశ్ సవాల్ విసిరారు.
గురుకులాల హాస్టళ్లలో భోజనం కలుషితం అవుతున్నదని, వంటల్లో ఎలుకలు, బల్లులు పడుతున్నాయని, చివరికి కారం మెతుకులతో అన్నం తినే పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ప్రభుత్వ హాస్టల్‌కు పోయి ఒక్క మంత్రయినా అన్నం తిన్నడా?.. విద్యార్థులను పరామర్శించారా?’ అంటూ ప్రశ్నించారు. వైన్స్ షాపులకు టార్గెట్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని, ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్ మాని గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్మూర్‌లో ఏడుగురిని కుక్కలు కరిచాయని చెప్పారు. జ్వరం సర్వే తుతూ మంత్రంగా సాగిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను ప్రారంభించడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
నాడు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్లో జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం లేదని, కానీ ఇప్పుడు అవకాశం కల్పించామని, 280 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు చేశామని హరీశ్ చెప్పారు. 18 కిలోమీటర్ల కిన్నెరసాని అభయరణ్యంలో ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటే దీనిని మార్చామని తెలిపారు. 77 కిలోమీటర్ల పైప్లైన్లతో నిర్వహణ సమస్యలు వస్తాయని, వీటిని 8.50 కిలోమీటర్లకు తగ్గించామని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం తామే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టినట్టు, రాత్రింబవళ్లు పనిచేయించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం తమకు ఎంతో సంతోషాన్నిస్తున్నదని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభాన్ని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున పండుగలా నిర్వహించుకుందాని చెప్పారు. తమకు భేషజాలు లేవని, 75 కోట్లతో సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామని చెప్తున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవాచేశారు.