హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘గ్రూప్ -1 పరీక్షల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. ఫార్ములా-ఈ రేస్ కేసులో లీక్‌లు ఇస్తున్నది’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 9 నెలలపాటు విచారణ పేరిట ఏసీబీ డ్రామా చేసిందని ఆరోపించారు. మూడుసార్లు కేటీఆర్‌ను విచారణ పేరిట ప్రశ్నించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అల్లిన స్టోరీనే రిపోర్టు పేరిట ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని విమర్శించారు. గ్రూప్-1 వైఫల్యాలు, హైకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసును తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వండి వారుస్తున్న ఈ కథలన్నీ త్వరలో ఫెయిల్ కావడం పక్కా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.