Harish Rao | కాంగ్రెస్ అప్పులు, తప్పులు తెలంగాణ ప్రజలకు భారంగా మారుతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల ప్లాంట్ నిర్మించిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 1600 మెగావాట్లకు ఒప్పందం జరిగిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 2400 మెగావాట్లపై ఒప్పందం కోసం ఎన్టీపీసీ కోరిందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ మూడు సార్లు కలిశారని పేర్కొన్నారు. ఎక్కువ ధరకు ఎన్టీపీసీ నుంచి ఎందుకు కొనాలని సీఎం చెప్పారని తెలిపారు. 60 శాతం ఉన్న థర్మల్ పవర్‌ను 40 శాతానికి తగ్గిస్తామని శ్వేతపత్రం పెట్టారని గుర్తుచేశారు. కమీషన్ల కోసం ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతామంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకాలతో గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించారని అన్నారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని వదిలేసి థర్మల్‌కు ఎందుకెళ్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఎన్టీపీసీ నుంచి 800 మెగావాట్లకు యూనిట్‌కు రూ.4.12 ప్రకారం ఒప్పందం జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 మెగావాట్ల ప్రతిపాదనలు పెట్టారని అన్నారు. రామగుండం ప్లాంట్‌కు జెన్కో డీపీఆర్ ఇచ్చిందని తెలిపారు. 800 మెగావాట్లకు రూ.10,800 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు పెట్టిందని పేర్కొన్నారు. మూడు ప్లాంట్లకు కలిపి రూ.45 వేల కోట్ల ఖర్చవుతుందని చెప్పిందన్నారు. కొత్త ప్లాంట్లలో ఉత్పత్తికి యూనిట్‌కు రూ.7.70 ఖర్చవుతుందని అన్నారు. ఎన్టీపీసీ కంటే యూనిట్‌కు రూ.3 కంటే ఎక్కువ ఖర్చవుతుందని అన్నారు. సొంత ప్లాంట్లలో ఉత్పత్తి వల్ల రోజుకు 9 కోట్లు ప్రజలపై భారం పడుతుందని వివరించారు. అంటే ఏడాదికి రూ.3800 కోట్ల అదనపు భారం పడుతుంని అన్నారు. కరెంటు కొనుగోలు కోసం 25 ఏళ్ల ఒప్పందం చేసుకుంటారని.. అలా పాతికేళ్లలో తెలంగాణ ప్రజలపై రూ.82వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు.
అప్పు, మిత్తి లేకుండా కరెంటు ఇవ్వడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. అప్పు పుట్టడం లేదంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు కడతామని కాంగ్రెస్ చెబుతుందని విమర్శించారు. ప్రజలపై భారం పడవద్దనే బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని తెలిపారు.
మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ గత చరిత్ర చూసుకోవాలని భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు హితవు పలికారు. ఏ బొగ్గు ఉన్నదని విజయవాడ, రాయలసీమ, కృష్ణపట్నంలో విద్యుత్ ప్లాంట్లు కట్టారని ప్రశ్నించారు. బ్యాలెన్స్ చేసుకోవడానికే వేర్వేరు చోట్ల థర్మల్ ప్లాంట్లు కడతారని తెలిపారు. థర్మల్ ప్లాంట్లలో ఫ్లై యాష్ ప్రధాన సమస్యగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి, నీరు అందుబాటులో ఉండటం వల్లనే దామరచర్లలో ప్లాంట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఫ్లైయాష్ వాడుకుంటామని సిమెంట్ ఫ్యాక్టరీలు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నాడు తాళం వేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రగల్బాలు పలికారని అన్నారు. నాడు తాళం వేస్తానన్న కోమటిరెడ్డి.. నేడు కేబినెట్లో తాళం కొడుతున్నారని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభానికి వెళ్లడానికి కోమటిరెడ్డికి సిగ్గుండాలన్నారు.