Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి.. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ సాధించారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆంధ్రా వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించారా అని నిలదీశారు. కర్ణాటక పరిధిలో ఉన్న ఆర్డీఎస్ కాలువకు తక్షణమే మరమ్మతులు చేసి, క్రమం తప్పకుండా నిర్వహించేలా ఆ రాష్ట్రం నుంచి హామీ తీసుకున్నారా అని అడిగారు. ఈ పనులు జరగకపోవడం వల్లే ఆర్డీఎస్ కింద తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా ప్రతిసారీ కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు.
కేవలం తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.. గత 75 ఏళ్లుగా పాత గేట్లు పనిచేస్తూనే ఉన్నాయని.. అయినా కూడా ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదని గుర్తుచేశారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడానికీ, తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల నీటి వాటాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరి ఈ కీలకమైన విషయంపై రేవంత్ రెడ్డి సాధించిన హామీ ఏమిటని ప్రశ్నించారు.
“సిస్టమ్ లాసెస్” అనే వాదనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (KWDT-I) అవార్డులో ఈ “సిస్టమ్ లాసెస్” అనే విధానానికి అసలు గుర్తింపే లేదని తెలిపారు. ట్రైబ్యునల్ అవార్డు పరిధిలో లేని ఈ వాదనను అడ్డుపెట్టుకుని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను తగ్గించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి వాడుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేసీ కెనాల్ కోసం సుంకేసుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. దీనికి తోడు, కర్ణాటకతో కుమ్మక్కై కేసీ కెనాల్‌కు వెళ్లాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను RBHLC,RBLLC లకు మళ్లిస్తోందని తెలిపారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు నిలదీయలేదని.. తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారే కొత్త ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.
Instead of celebrating the replacement of Tungabhadra gates at Karnataka, Chief Minister @revanth_anumula must answer the following fundamental questions concerning Telangana’s rightful share of Krishna waters:
Did Revanth Reddy secure concrete assurances on the real issues…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 25, 2026
తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్యలో దాదాపు 35 టీఎంసీలు వాడుకునేలా కర్ణాటక ప్రభుత్వం ‘నవేలి రిజర్వాయర్’ నిర్మించాలని చూస్తోందని హరీశ్‌రావు తెలిపారు. అలాగే ఆర్డీఎస్, సుంకేసుల మధ్య 20 టీఎంసీలు వాడుకునేలా ‘గుండ్రేవుల ప్రాజెక్టు’ కట్టాలని ఆంధ్రా ప్రదేశ్ సర్కార్ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు తీవ్ర గండిపడుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు న్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి ఎందుకు అభ్యంతరాలు తెలుపలేదని.. ఇన్ని సమస్యలు పెట్టుకుని రేవంత్ రెడ్డి దేనికోసం సంబురాలు చేసుకుంటున్నారు? తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల వాటాను సాధించారా? అని ప్రశ్నించారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్డీఎస్ సమస్యలను పరిష్కరించారా లంగాణకు మేలు చేసే ఈ కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కచ్చితమైన హామీలు ఏమైనా తీసుకున్నారా?అని నిలదీశారు. ఈ ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా జరిగిన సమావేశం సువర్ణ అధ్యాయం ఎలా అవుతుంది? తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణను గాలికి వదిలేసి ప్రచారం పేరిట మీరు చేసిన డ్రామా తెలంగాణకు నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించారు.