Harish Rao | ధాన్యపు రాశులను గాలికి వదిలేసి.. అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే.. రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇవేవి పట్టడం లేదని.. అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. ధాన్యపు రాశుల చుట్టూ తిరగాల్సిన వారంతా అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారన్నారన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.512కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉంటూ.. అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారని మండిపడ్డారు.
వేలాదిమంది పోలీస్‌లను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ సీఎంకు సమయం లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులపై ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదన్నారు. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోందని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదన్నారు. కొన్న వడ్లకు రూ.4వేల కోట్లు బకాయి పడిందని గుర్తు చేశారు.
48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్భాలు పలికారని.. పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదన్నారు. బోనస్ ఊసే లేదని.. యాసంగి పంటకు రూ.512 కోట్ల సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉందన్నారు. కానీ, ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నదని.. లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయింద్నారు. పెట్టుబడి సహాయం అందించడంలో జాప్యం జరుగుతుందని, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారని.. యాసంగి రైతుబంధు మూడెకరాలకు మించి వేయలేదన్నారు.
పెట్టుబడి సాయం కోసం రూ.18వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని భట్టి అంటున్నారని.. సంవత్సరమంతా మెల్లగా ఇస్తామని అంటున్నారన్నారు. కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సహాయం ఇంకా వేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ రూ.10వేలు ఇస్తున్నాడని.. మేం రూ.15వేలు ఇస్తామని అన్నారని.. అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడేమో ఓడ దాటాక బోడ మల్లన్న అన్న విధంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయడంలో జాప్యం.. కొన్న ధాన్యాన్ని తరలించడంలో జాప్యం.. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో జాప్యం అంటూ మండిపడ్డారు.