Harish Rao | రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు గానీ.. రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీలా తయారైందని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించడాన్ని మీరు మెచ్చుకుంటున్నారా? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు ఆదివారం నాడు జహీరాబాద్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ దద్దమ్మ పాలనలో కేసీఆర్ కష్టపడి కట్టిన మిషన్ భగీరథను కనీసం నడిపే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చాక దోమల నివారణకు ఫాగింగ్ లేదు గానీ.. పాలనలో అంతా ఫ్రాడింగ్ నడుస్తోందని అన్నారు. గల్లీల్లో మురుగు నీరు పారుతుంటే.. ముఖ్యమంత్రి నోటి నుంచి అంతకంటే దారుణమైన మురికి మాటలు వస్తున్నాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలనలో పేదలకు స్కీంలు బంద్ అయ్యాయి.. కాంగ్రెస్ నాయకులకు స్కాంలు మాత్రం ఫుల్లుగా నడుస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు.. గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క పని లేదని అన్నారు. అందుకే కేసీఆర్ మీద విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన పాలనలో పిచ్చితనమే తప్ప పచ్చదనం ఎక్కడా లేదని విమర్శించారు. తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను పట్టుకొని, కనీస గౌరవం, నీతి లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు..
కేటీఆర్‌కు ఇంగ్లీష్ వచ్చని తిడతాడు, నా పొడుగును చూసి నన్ను తిడతాడు. అసలు ముఖ్యమంత్రి అంటే ఇలాగేనా ఉండేది అని హరీశ్‌రావు మండిపడ్డారు. అతి నీచమైన బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించుకున్నాడని అన్నారు. చరిత్రలో ఎవరైనా నిలవాలి కానీ.. ఇలా రేవంత్ రెడ్డిలా చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి మున్సిపల్ శాఖ కూడా ఉంది. కానీ ఆయన నోరు కచ్రా .. ఆయన చూస్తున్న మున్సిపాలిటీల్లోనూ అంతా కచ్రానే ఉందని అన్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చి, అభివృద్ధి చేసి చూపించారని హరీశ్‌రావు తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు.. ఇలా ఎన్నో పథకాలు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక అవన్నీ బంద్ అయ్యాయని తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం గతంలో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని., బాగారెడ్డి ఫ్లై ఓవర్ వేయించాం, గల్లీ గల్లీలో రోడ్లు వేయించామని తెలిపారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు పనుల నాణ్యత చూడటానికి సైకిల్ మీద తిరిగిన రోజులు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక జహీరాబాద్ లో ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఒక్క పని కూడా చేయలేదని అన్నారు.
తులం బంగారం ఏమైంది అని అడిగితే రేవంత్ రెడ్డి నోరు మెదపడు.. మహిళలకు ఇస్తానన్న రూ. 2500 మహాలక్ష్మి ఏమైంది అంటే మాట్లాడడు అని హరీశ్‌రావు తెలిపారు. ప్రశ్నిస్తే మాకు నోటీసులు ఇస్తున్నాడని అన్నారు. నాకు నోటీసులు ఇస్తేనో, నా మీద కేసులు పెడితేనో పేదోళ్ల కడుపులు నిండుతాయా అని ప్రశ్నించారు. మీరు వంద నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పైసలు వచ్చే దాకా మీ వెంట పడుతూనే ఉంటామని తెలిపారు. కేటీఆర్ ను తిట్టే బదులు.. రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చాలని హితవు పలికారు.
ఈ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతో ప్రజలు రేవంత్ రెడ్డికి వాతలు పెట్టాలని హరీశ్‌రావు కోరారు. నా పొడుగు గురించి, కేటీఆర్ ఇంగ్లీష్ గురించి మాట్లాడే రేవంత్ రెడ్డికి.. ఇంగ్లీష్ రాదు, పాలన రాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను చూసి పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని హరీశ్‌రావు అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ నిలదీస్తేనే.. దిగొచ్చి అజారుద్దీన్ కు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ.. మేము నియత్ ఉన్న వాళ్లమని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క హిందూ-ముస్లిం గొడవ జరగలేదని గుర్తుచేశారు..
తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ కామ్.. బీఆర్ఎస్ కా నామ్ అని హరీశ్‌రావు అన్నారు. కానీ ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో బీజేపీతో అంటకాగుతోందని తెలిపారు. అక్కడ ఏకంగా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను బీజేపీతో పంచుకుందని చెప్పారు. అక్కడ బీజేపీతో కలిసి పని చేస్తూ.. జహీరాబాద్ లో లౌకికవాదం గురించి మాట్లాడితే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ప్రజలను మోసం చేశారని అన్నారు.బాండ్ పేపర్ రాసిచ్చి కూడా రెండున్నరేళ్లలో హామీలు అమలు చేయని వాళ్లు.. ఇప్పుడు మళ్లీ కొత్త బాండ్ పేపర్లు రాసిస్తామంటే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నించారు. అది అంతా బూటకమని తెలిపారు. కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలన్నీ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని.. జహీరాబాద్ మున్సిపాలిటీల్లో ఎగిరేది గులాబీ జెండానే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ లో జరిగిన అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలిపారు. అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.