Harish Rao | ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘన నివాళులు తెలిపారు.
హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హరీశ్‌రావు హృదయపూర్వకంగా మనవి చేశారు. శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండని భరోసానిచ్చారు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేశారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్(55) మృతదేహం తన అల్లుడి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.