Harish Rao | మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదనతో మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేంపూర్కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సరఫరా చేసే బియ్యం మొత్తం ప్లాస్టిక్ లెక్క ఉంటున్నాయని తెలిపారు. పిల్లలకు ఏమన్న అయితే మమ్మల్నే అంటారు కదా అని ఆవేదన చెందారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు భోజనం కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా పెట్టడం లేదని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు జీతాలు పెంచి, సమయానికి జీతాలు, బిల్లులు ఇచ్చిండని తెలిపారు. రేవంత్ రెడ్డి గత సంవత్సరం నుంచి జీతాలు, బిల్లులు ఇవ్వకపోవడంతో రూ.2లక్షల అప్పు చేసి, నా ఇల్లు తాకట్టు పెట్టి పిల్లలకు భోజనం పెడుతున్నానని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి గారూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తమనే డబ్బా ప్రచారం ఇకనైనా ఆపి.. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.@revanth_anumula @TelanganaCMO… pic.twitter.com/D5gsYsOEK7
— Harish Rao Thanneeru (@BRSHarish) November 24, 2025