Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు. నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని గెస్ట్ లెక్చరర్స్ నిర్ణయించున్నారని హరీశ్‌రావు తెలిపారు. లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నదని మండిపడ్డారు. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం..ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు అని అన్నారు. కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించండని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మీ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి, మీ పరువు కాపాడుకోవాలని హితవు పలికారు.