Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని అన్నారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుందని.. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని తెలిపారు.
శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని హరీశ్‌రావు విమర్శించారు. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారని, ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్ కదా అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్ అని ప్రశ్నించారు.
ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని.. ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు.. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా అని మండిపడ్డారు. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.