Harish Rao | సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు సందర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభుత్వం 49 వేల మంది రైతుల దగ్గర మక్క పంట కొని దాదాపు 450 కోట్ల బకాయి పెట్టిందని తెలిపారు. రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి.. 50 రోజులైనా ఇప్పటికీ రైతులకు డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. రైతులు ఇంకో పంట వేసుకోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు.
యాసంగి పంట వేసుకోవడానికి డబ్బులు లేక పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మక్క రైతులకు బాకీ పడ్డ డబ్బులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 45కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు హరీష్ రావు దమ్మున్న సవాల్ 🔥
కాళేశ్వరం కూలిందని ఇష్టమొచ్చినట్లుగా
అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్.. 😡
దమ్ముంటే సిద్దిపేటకు రా..
రంగనాయక సాగర్‌లో బండకు కట్టి నిన్ను ఎత్తేస్తా..
నువ్వు మునుగుతావో.. తేలుతావో చూద్దాం..నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్లు..
నువ్వు… pic.twitter.com/AfUhuNtMOo— BRS Party (@BRSparty) December 7, 2025
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగకు చీరెలు ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓటు అడగాలి అంటే ముందు మహిళలకు బకాయి పడ్డ 60వేలు ఇవ్వాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తు గా ఓడించాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతులకు బోనస్ పడాలి అంటే కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు.
వచ్చే ఏడాది నుంచి పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. నేటికి పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. కాళేశ్వరం కూలిందని … కేసీఆర్, హరీశ్‌రావులను బండకేసి కొట్టాలని రేవంత్ రెడ్డి మాట్లాడిండని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా… రంగనాయక సాగర్ లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా.. నువ్ మునుగుతవో.. తేలుతవో చూద్దామని వ్యాఖ్యానించారు. రంగనాయక సాగర్లోనీళ్ళుండి నువ్ మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు.. నువ్ తేలితే కాళేశ్వరం కూలినట్టు అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వి అన్ని అబద్ధాలు, ఆయన చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు.