Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు. తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోడ వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్ )ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి వచ్చిందన్నారు. పచ్చటి పొలాల గుండా అలైన్మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్తో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంలా మారాయన్నారు. ఉత్తర భాగాన అలైన్మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్న గూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉన్నది ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులే అని పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్పుతో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
రైతులు భూములు కోల్పోకుండా మొదటగా ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్, చేవెళ్ల మీదుగా ప్రతిపాదించిందని హరీశ్‌రావు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాన్ని అష్టవంకరలు తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్ర పన్నారని ఆరోపించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు 40 కిలోమీటర్లు దూరం ఉండాల్సి ఉండగా 23 కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. సొంత భూములకు మేలు కలిగేలా ముఖ్యమంత్రి అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. గంగారం శివన్న గూడెం గ్రామంలోని పూర్తి భూమి కోల్పోయి గ్రామం మొత్తం నిర్వాసితులు అవుతున్నారని… ఇంతమంది రైతుల ఆవేదన రేవంత్ రెడ్డికి అర్థం అవడం లేదా అని ప్రశ్నించారు.
Harish Rao
ఒక ఊరికి ఊరే పూర్తిగా నీ ధన దాహానికి బలైతుంటే కనీసం నీకు దయలేదా..రేవంత్ రెడ్డీ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా ప్రతిపాదించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించి రైతుల భూములు ఎక్కువగా నష్టపోకుండా అలైన్‌మెంట్‌ను చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పేద రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నాయకుల భూములను కాపాడుతున్నదని అన్నారు. ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదని.. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా అలైన్‌మెంట్‌ను మారుస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు బదులుగా 28 కిలోమీటర్లకు కుదించడానికి నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని హరీశ్‌రావు విమర్శించారు. మధ్య నుంచి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నది. బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల పొట్టలుగొట్టే ప్రణాళికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.
హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వివరాలను యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతో ప్రభుత్వం ప్రచురించిందని.. ఇందులో ఎక్కువగా రైతుల భూములే కోల్పోతున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం వల్ల భూములు కోల్పోతున్న రైతులు అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్నారని పేర్కొన్నారు. జీవనాధారమే లేకుండా పోతుందని కడుపుమండిన వేలాది మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్లపై కొచ్చి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. పాత ఆలైన్మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబాద్-శ్రీశైలం హైవేపై మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకటోనిపల్లి రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.
నాడు ఫార్మా సిటీ వద్దు అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని.. గిరిజనుల బిడ్డలను జైళ్ల పాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. నాడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు.. నేడు మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారూ.. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా అని ప్రశ్నించారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ గారితో.. ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారన్నారు. కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధిస్తూ దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేనశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తన స్వ లాభం కోసం అలైన్‌మెంట్‌ను మారుస్తున్న రేవంత్ రెడ్డికి రాష్ట్రంతో పాటు రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. పదే పదే అలైన్ మెంట్ మారుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్‌ను తిరస్కరించే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత డబ్బులతో ట్రిపుల్ ఆర్ చేపడితే అది ఖజానా కు పెను భారం కాదా అని ప్రశ్నించారు. సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేలకోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతున్నదని తెలిపారు. అందిన కాడికి దోచుకోవడం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మారుస్తున్న తతంగం పై వెంటనే విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ట్రిపుల్ ఆర్ నిర్మాణం తన ఇంటి వ్యవహారం కాదని రాష్ట్రం, రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టే చర్యలు ఆపక పోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, దక్షిణ దిక్కున 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగానే, ఉత్తర భాగాన పరిగణలోకి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సమస్య పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.