Harish Rao | కాంగ్రెస్ హయాంలో పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎల్‌నినో వస్తుందని హడావుడిగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ అంటూ పోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. గత 30 నెలలుగా మేడిగడ్డ రిపేర్లు చేపట్టవద్దని అనలేదు కదా అని ప్రశ్నించారు.
తమ్మడిహట్టి బ్యారేజ్‌ను150 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కిరణ్‌కుమార్ ఉన్నప్పుడే ఒప్పందమైందని మంత్రి వివేక్ అంటున్నారని మండిపడ్డారు. ఇంత పచ్చి అబద్ధమా.. ప్రజలు ఏమనుకుంటారన్న సోయి ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. 150 మీటర్లకు ఆనాడు ఒప్పందమైతే ఇంతవరకు పనులు ఎందుకు మొదలుపెట్టలేదని నిలదీశారు. మహారాష్ట్ర సీఎం మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా పనులు చేస్తున్నారని అభ్యంతరం చెప్పారని తెలిపారు. మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అగ్రిమెంట్ కాకుండా పనులు చేస్తున్నారని ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం తెలిపారని చెప్పారు. కిరణ్ కుమార్ ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే తోక దగ్గర ఎందుకు పనులు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర కాకుండా చేవెళ్ల దగ్గర ఎందుకు పనులు చేపడుతున్నారని అడిగారు. దీన్ని అవగాహన రాహిత్యమని అనుకోవాలా? ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అనుకోవాలనా అని ప్రశ్నించారు.
తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లుపోతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టి సుందిళ్ల బ్యారేజీకి నీళ్లు తెస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. తమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. జూపల్లి కృష్ణారావు లిఫ్టే అవసరం లేదంటున్నాడు.. సీఎం, మంత్రులు ఎవరి చెప్పింది కరెక్టు అనుకోవాలని ప్రశ్నించారు. కనీస పరిజ్ఞానం లేకుండా సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.