హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గురుకులాలా లేక నరకకూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’ అని బుధవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలు అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ దవాఖానలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నది. బుధవారం నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి దవాఖాన లో చికిత్స పొందుతున్నడు. ఇప్పుడు నారాయణ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలేం జరుగుతున్నది?. పాఠా లు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. రేవంత్‌రెడ్డీ.. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుకొంటున్నది? మీ నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలికావాలి?’ అని నిప్పులు చెరిగారు. ‘దవాఖానల పాలైన విద్యార్థులను హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించాలి.. విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదు గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, విద్యాబోధన జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దే ఉన్నా సీఎం ఏనాడూ వాటిపై సమీక్షించలేదని విమర్శించారు. పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా సీఎం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ‘11 నెలల్లో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు..కలెక్టర్లూ.. కనీసం మీరైనా బడులను చూడండి’ అని సూచించారు.గుడ్ల పంపిణీ నిలిచి పోయిందని, బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులు 11 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారని వాపోయారు.
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణవాది, మాజీ ఎమ్మెల్సీ చుకా రామయ్యకు మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడారు. ‘సమాజానికి మీరు అందించిన విద్య, సామాజిక సేవలు ఎంతో గొప్పవి. మీ సేవలు తెలంగాణ సమాజానికి మరింతగా ఉపయోగపడాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.