కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానలు, ఐటీ పార్కులకు అనుమతులిస్తున్నట్టు పత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చేవి. రేవంత్ పాలనలో ఓఆర్ఆర్ లోపల, బయట భూములు అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్నయి.. కేసీఆర్ అంటే నమ్మకం..రేవంత్ అంటే అమ్మకం. ఔటర్ చుట్టుపక్కల భూములను టీజీఐఐసీ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ విలువలో కేవలం 30 శాతానికే ధారాదత్తం చేయాలని చూడటం దుర్మార్గం.
– హరీశ్‌రావు
భూముల అమ్మకంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తుంటే ఇందులో ఏదో మతలబున్నదన్న విషయం అర్థమవుతున్నది. వారంలో దరఖాస్తు చేసుకోవాలి.. మరో వారంలో టీజీఐఐసీ అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేస్తది.. ఆ తర్వాత వారంలో అధికారుల కమిటీ అనుమతి ఇస్తది.. అనంతరం 45 రోజుల్లో నగదు చెల్లింపు పూర్తిచేయాలి అని నిర్దేశించడంలో లోగుట్టు ఏంది?
– హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి కాద ని.. అమ్మకాల రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశా రు. కుంభకోణాలకు కేరాఫ్ అయిన కాం గ్రెస్.. హెచ్ఐఎల్టీపీ ముసుగులో 9,292 ఎకరాలను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నదని, తద్వారా దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు.
శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు, సన్నిహితులు, అనుచరులు కలిసి పారిశ్రామికవేత్తలతో కుమ్మైక్కె రూ.5 లక్షల కోట్ల విలువైన విలువైన భూములను కేవలం రూ.5 వేల కోట్లకే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానలు, ఐటీ పార్కులకు అనుమతులిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేవి. రేవంత్ రెడ్డి పాలనలో ఓఆర్ఆర్ లోపల, బయట భూములు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ అంటే నమ్మకం.. రేవంత్ అంటే అమ్మకం..’అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తె చ్చింది ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ’ అని నిప్పులు చెరిగారు. అవుటర్ రింగురోడ్డు చుట్టుపక్కల ఉన్న భూములను టీజీఐఐసీ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ విలువ కేవలం 30 శాతానికే ధారదాత్తం చేయాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
లగచర్ల, హెచ్‌సీయూ ఇలా వేల ఎకరాల భూములను తెగనమ్ముతున్నారు. గజాలు, ఇంచుల లెక్కన వేల ఎకరాలను తెగనమ్ముతున్నారు. హౌసింగ్‌బోర్డులో ఆరు, ఎనిమిది గజాలను కూడా అమ్ముకున్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కింది. భవిష్యత్ తరాల కోసం ఎకరం భూమి కూడా మిగల్చవా రేవంత్‌రెడ్డి?
– హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ధోరణిని పక్కనబెట్టి, భూముల పేరిట అడ్డగోలు దోపిడీపైనే దృష్టిపెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. లగచర్ల, హెచ్‌సీయూ ఇలా వేల ఎకరాల భూములను తెగనమ్ముతున్నారని విరుచుకుపడ్డారు. గజాలు, ఇంచుల లెక్కన వేల ఎకరాలను తెగనమ్ముతున్నారని దుయ్యబట్టారు. హౌసింగ్‌బోర్డులో గజాలెక్కన కూడా అమ్ముకున్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని దెప్పిపొడిచారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కోసం భూములను అమ్మితే రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని గుర్తు చేశారు. ‘ఇలా అమ్ముకుంటూ పోతే దవాఖానలు, విద్యాలయాలు, చివరకు శ్మశనాలు కట్టేందుకు భూములు దొరకవు’ అని రేవంత్ రెడ్డి సుద్దపూస మాటలు చెప్పి, ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు. ‘భవిష్యత్ తరాల కోసం ఎకరం భూమి కూడా మిగల్చవా రేవంత్‌రెడ్డి?’ అని సూటిగా ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూములను 50 శాతం ప్రభుత్వం తీసుకొని, మిగిలిన 50 శాతం భూములను రెగ్యులరైజ్ చేస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 50 శాతం భూములను ప్రభుత్వం తీసుకుంటే ప్రజా అవసరాలకు ఉపయోగపడేవన్నారు. లంగ్‌స్పేస్ పార్క్‌లు, బస్‌డిపో, బస్టాండ్, హాస్పిటల్, కాలేజీ, స్కూల్.. ఇలా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు కడదామంటే హైదరాబాద్‌లో స్థలం దొరికే పరిస్థితి లేదన్నారు. ‘అనాడు బొందలగడ్డకు, శ్మశానవాటికకు స్థలాలు లేవని రేవంత్‌రెడ్డి అనలేదా.. ? ఈ రోజు బొందల గడ్డలకు జాగల్లేకుండా గజాల చొప్పున భూములు అమ్మతున్నావు మిస్టర్.. మీది నోరా.. ? మోరా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలోనూ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆజామాబాద్ భూములను క్రమబద్ధీకరించామని, ఎస్ఆర్వో ధరకు 200 శాతం ఫీజు తీసుకున్నామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్వో విలువలో 30 శాతం మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. హెచ్ఐఎల్టీపీ ముసుగులో 9,292 ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యమన్నారు. ఎస్ఆర్వో విలువలో 30 శాతానికే భూముల అమ్మకం నిజమేనని ఒప్పుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
9,292 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీలు పోగా కేవలం 4,740 ఎకరాల భూమే ఉన్నదని మంత్రి శ్రీధర్‌బాబు బుకాయిస్తున్నారు. భూములను సగానికి తగ్గించి, కుంభకోణం పరిధిని తగ్గించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. పైగా 100 శాతం ఎస్ఆర్వో విలువతో అమ్మకానికి పెడితే ఎవరూ కొనరని చెప్పడం సమంజసం కాదు. బీఆర్ఎస్ పాలనలో 200 శాతం ఎస్ఆర్సీ విలువకు భూములను విక్రయించాం. దీనిపై బహిరంగ చర్చకు మంత్రి శ్రీధర్‌బాబు సిద్ధమా?
– హరీశ్‌రావు
వేలాది ఎకరాలను అమ్మకానికి పెట్టిన హెచ్ఐఎల్టీపీ పాలసీపై ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. హడావుడిగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలోని అంతర్యమేంటని నిలదీశారు. మొన్న మంత్రి చెప్పిన వివరాలతోనే సర్కారు డొల్లతనం బట్టబయలైందని నిప్పులు చెరిగారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌తో పోల్చితే రెండు రేట్ల స్కామ్ అని ఆరోపించారు. సర్కారు తీరుతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని, ఎందుకు మాట్లాడటంలేదని హరీశ్‌రావు నిలదీశారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కాంగ్రెస్‌తో కుమ్మకు కాకున్నా ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
‘దసరా, దీపావళికి బొనాంజా ఆఫర్లు చూస్తుంటాం.. కానీ ఈ పాలసీలో రేవంత్‌రెడ్డి బొనాంజా ఆఫర్ పెట్టిండు’ అని హరీశ్‌రావు చురకలంటించారు. 30 శాతానికే ల్యాండ్ కన్వర్షన్‌తోపాటు అందులోనే ప్రాసెసింగ్ ఫీజులు చేర్చడం దుర్మార్గమన్నారు. రెవెన్యూ, హెచ్ఎండీఏకు పైసా కట్టనవసరం లేదని, ఆల్ ఫ్రీ అంటూ రేవంత్‌రెడ్డి బొనాంజా ప్రకటించారని ఎద్దేవా చేశారు. 30 శాతమే అన్యాయమని తామంటుంటే.. ఏ ఫీజూ కట్టనవసరం లేదని చెప్పడం ఏమిటని నిలదీశారు. 9,200 ఎకరాలకు హెచ్ఎండీఏ, నాలా, కన్వర్షన్ విలువ రూ.13,500 కోట్లు అని తెలిపారు. ఈ ఆదాయం వస్తే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్ట్రామ్ వాటర్ డ్రైయిన్లు కట్టొచ్చు అని వివరించారు. ఈ డబ్బంతా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో కాలుష్యకారక పరిశ్రమల 50 శాతం భూముల్లో ఐటీ కంపెనీలు, టీ పార్క్‌లు, మిగిలిన 50శాతం భూములను గృహ అవసరాలకు వినియోగించుకునేలా పాలసీ తెచ్చాం. కానీ కాంగ్రెస్ మాత్రం సినిమా టాకీసులు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లే ఔట్లుగా చేసి అమ్ముకునే అవకాశం కల్పించింది. మాది ఖజానా నింపే పాలసీ. కాంగ్రెస్ వాళ్లది జేబులు నింపుకునే పాలసీ.
– హరీశ్‌రావు
భూములు అమ్మకంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తనే ఇందులో ఏదో మతలబు ఉన్నదనే విషయం అర్థమవుతున్నదని చెప్పారు. ‘వారంలో దరఖాస్తు చేసుకోవాలని.. మరో వారంలో టీజీఐఐసీ అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేస్తుందని.. ఆ తర్వాత వారంలో అధికారుల కమిటీ అనుమతి ఇస్తుందని.. తదనంతరం 45 రోజుల్లో నగదు చెల్లింపు పూర్తిచేయాలని నిర్దేశించడంలో లోగుట్టు ఏమిటి?’ అని నిలదీశారు. రూ. 5 లక్షల కుంభకోణం కథను రెండు నెలల్లోనే పరిసమాప్తం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు యత్నిస్తున్నదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు అనాడు బీఆర్ఎస్ ఉత్తమమైన టీఎస్ఐపాస్ పాలసీని తెచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఉన్న భూములను తెగనమ్మడానికి హెచ్ఐఎల్టీపీ పాలసీని తెచ్చారని కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ ఉన్న తేడా ఇదేనని స్పష్టంచేశారు. ‘బీఆర్ఎస్ పెట్టుబడులు తెచ్చింది.. పరిశ్రమలు తెచ్చింది.. ఉద్యోగాలు కల్పించింది. కానీ కాంగ్రెస్ ఉన్న భూములను అమ్ముతున్నది’ అని ధ్వజమెత్తారు.
ఓఆర్ఆర్ లోపలున్న కాలుష్య కారక పరిశ్రమలను మాత్రమే అవుటర్ వెలుపలికి పంపాలన్నది పాలసీ ఉద్దేశమని, కానీ కాంగ్రెస్ తెచ్చిన పాలసీతో గ్రీన్ కేటగిరీ (కాలుష్యరహిత) కంపెనీలు కూడా అవుటర్ బయటికి తరలివెళ్లాల్సి వస్తున్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో కంపెనీలు, ఉద్యోగాలు పోయే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ‘ఉద్యోగాల కల్పన మాది.. ఉద్యోగాలు ఊడదీసే కథ మీది’ అంటూ విరుచుకుపడ్డారు. ఇది రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రభుత్వమని, అనుయాయులకు అడ్డికి పావుశేరుకు భూములను కట్టబెట్టే ప్రభుత్వమని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.
ఆర్ఆర్ ట్యాక్స్ కోసమే గ్రీన్ కేటగిరీ పరిశ్రమలను తరలించబోతున్నారని ఆరోపించారు. తాము కాలుష్యకారక పరిశ్రమల 50శాతం భూముల్లో ఐటీ కంపెనీలు, టీ పార్క్‌లు, మిగిలిన 50శాతం భూములను గృహ అవసరాలకు వినియోగించుకునేలా పాలసీ తెచ్చామన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం సినిమా టాకీసులు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లే ఔట్లుగా చేసి అమ్ముకునే అవకాశం కల్పించిందని ధ్వజమెత్తారు. ‘మాది ఖజానా నింపే పాలసీ.
కాంగ్రెస్ వాళ్లది జేబులు నింపుకునే పాలసీ’ అని అభివర్ణించారు. ఓఆర్ఆర్ లోపలున్న భూములు బంగారం లాంటి భూములని, భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు వీటిని వాడుకునే వీలుందని, కానీ ప్రభుత్వం ఈ దిశలో ప్రయత్నించడంలేదన్నారు. ‘కాంగ్రెస్‌కు ఉన్న విజనల్లా జేబులు నింపుకునే, ఖజనా కొల్లగొట్టే విజన్’ అని మండిపడ్డారు. ప్రజల కోసమే పనిచేసే విజన్ ఉంటే ఈ పాలసీ తేవాలనుకోరన్నారు.
అవుటర్ రింగురోడ్డు చుట్టు పక్కల ఉన్న రూ.5 లక్షల విలువైన 9292 ఎకరాలను రూ.5వేల కోట్లకే ప్రభుత్వం ఎందుకు ఇతరులకు కట్టబెడుతున్నదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి శ్రీధర్‌బాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. పైగా 9,292 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీలు పోగా కేవలం 4,740 ఎకరాల భూమే ఉన్నదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి చెప్పిన మాటలు సత్యదూరమని కొట్టిపారేశారు.
‘నేను రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా చెబుతున్న. అప్పట్లో సబ్ కమిటీలో నాతోపాటు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆరు నెలల కిందటే భూముల అమ్మకం ప్రతిపాదన తెచ్చారు. నిజంగా ప్రభుత్వం 4,740 ఎకరాలే అమ్మకానికి పెట్టిందా? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్‌రావు సవాల్ విసిరారు. వాళ్లు చెప్పేది నిజమైతే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికీ 9,292 ఎకరాలను ఎస్ఆర్వో విలువలో 30 శాతానికే అమ్మకానికి పెట్టారని తేల్చిచెప్పారు.
మంత్రి మాత్రం భూములను సగానికి తగ్గించి, భూ కుంభకోణం పరిధిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 100 శాతం ఎస్ఆర్వో విలువతో అమ్మకానికి పెడితే ఎవరూ కొనరని చెప్పడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో 200 శాతం ఎస్ఆర్సీ విలువకు భూములను విక్రయించామని మరోసారి గుర్తుచేశారు. కోర్టుకేసులు, లీజు వివాదాలను అడ్డుపెట్టుకుని మొత్తం కొల్లగొడుతున్నారా? అని తాము ప్రశ్నిస్తే సర్కారు సమాధానం ఇవ్వడం లేదన్నారు.
ఇదంతా నాలుగు కోట్ల మంది ప్రజల ఆస్తి. ఐదేండ్లు పాలించేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. తరాలుగా వస్తున్న ఆస్తిని అమ్మేందుకు అధికారం ఇవ్వలేదు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని పాలన చేయాలిగానీ, అడ్డగోలుగా భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.
– హరీశ్‌రావు
దేశంలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ స్కాం ఇది అని, దీని విలువ రూ.5లక్షల కోట్లు ఉంటుందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇదంతా నాలుగు కోట్ల మంది ప్రజల ఆస్తి అని, ఐదేండ్లు పాలించేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, తరాలుగా వస్తున్న ఆస్తిని అమ్మేందుకు అధికారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరాలను దృష్టిలో ఉంచుకుని పాలన చేయాలని, అడ్డగోలుగా భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే పారదర్శకమైన పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆస్తిని కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణే తమ బాధ్యత అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
టీజీఐఐసీ ధరను పక్కనబెట్టి రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతామని చెప్పి పెంచకముందే.. భూముల ధరలు సవరించకముందే.. అమలులోకి రాకముందే హెచ్‌ఐఎల్‌టీపీని ఎవరి మేలు కోసం తెచ్చిండ్రు?
వంద రూపాయలు గజం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 200 తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ఎందుకు 30 రూపాయలకు తగ్గించింది? లక్షల కోట్లను రాష్ట్ర ఖజానాకు రాకుండా నష్టం చేస్తున్నది వాస్తవం కాదా?
జీవో 135ను తెచ్చి పేదవాడు కొన్న భూమికి రిజిస్ట్రేషన్ ధరలపై ముక్కుపిండి 80 శాతం ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నరు.. దరఖాస్తు, ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేస్తున్నరు. మరి పెద్దలకు ఎందుకు ఆఫర్లు?
ఈ పాలసీలో రెవెన్యూ, హెచ్ఎండీఏకు బడాబాబులు పైసా కట్టనవసరం లేదని ఆల్ ఫ్రీ అని బొనాంజా పెట్టిండ్రు. అంటే పేదోడికో న్యాయం.. పెద్దోడికో న్యాయమా?
ఓఆర్ఆర్ లోపలే కాకుండా చుట్టుపక్కల భూములను కూడా కొల్లగొట్టే కుట్ర దాగి ఉన్నది. ఇది రేవంత్‌రెడ్డి, ఎనుముల సోదరుల జేబులు నింపే పాలసీనా? కాదా?
విలువైన భూములను ఎనుముల బ్రదర్స్, వాళ్ల అనుయాయులు అగ్రిమెంట్లు చేసుకున్నాక పక్కా ప్రణాళికతో ఆరు నెలల కిందటే పాలసీని రూపొందించింది నిజం కాదా?
30 శాతం డబ్బుతో పారిశ్రామిక వేత్తలకు ఇన్సెంటివ్స్ ఇస్తారా? పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? లేక కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు వాడుతారా?
– హరీశ్‌రావు ప్రశ్నల వర్షం
ఈ కుంభకోణంపై ప్రభుత్వానికి హరీశ్‌రావు 8 ప్రశ్నలను సంధించారు. తామడిగిన ప్రశ్నలకు సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
టీజీఐఐసీ ధరను పక్కనబెట్టి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకోవడంలోని అంతర్యమేమిటి?. ఉదాహరణకు మల్లాపూర్ పారిశ్రామిక వాడలో 240 ఎకరాలు ఉండగా, రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి రూ.17,581, టీజీఐఐసీ ధర రూ. 36,827 ఉన్నది. ఇలా రిజిస్ట్రేషన్ విలువకు టీజీఐఐసీ ధర రెండు, మూడు రెట్లు ఉంటుంది. అధికంగా ఉన్న టీజీఐఐసీ ధరను పక్కనపెట్టి రిజిస్ట్రేషన్ ధర అయిన రూ.17 వేలకే ఎందుకు మొగ్గుచూపుతున్నారు?. పైగా ఎస్ఆర్వో వ్యాల్యూలో కేవలం 30శాతం రేటుకే భూములు ఎందుకు కట్టబెడుతున్నారు?. ఉప్పల్ పారిశ్రామికవాడలోని 447 ఎకరాలకు రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి రూ.21,886 ఉంటే, టీజీఐఐసీ విలువ రూ. 52,523గా ఉన్నది. హయత్‌నగర్‌లో రిజిస్ట్రేషన్ విలువ రూ.14, 591 కాగా, టీజీఐఐసీ విలువ రూ.54,340. గాంధీనగర్‌లో రిజిస్ట్రేషన్ విలువ రూ.14,591గా ఉండగా, టీజీఐఐసీ విలువ రూ.46,895 మాత్రమే. టీజీఐఐసీ విలువను కాదని, రిజిస్ట్రేషన్ విలువను ఎందుకు పరిగణలోకి తీసుకున్నారో, పైగా 30 శాతానికే ఎందుకు కట్టబెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ధరలు తకువగా ఉన్నాయని, త్వరలో పెంచుతామని ముఖ్యమంత్రే ప్రకటించారు. భూముల ధరలు సవరించకముందే, కొత్త ధరలు అమలులోకి రాకముందే ఈ పాలసీని ఎవరి మేలు కోసం తెచ్చారు? ఎందుకోసం హడావుడిగా అమలు చేస్తున్నారు? పప్పుబెల్లాల్లా కట్టబెట్టి.. కొల్లగొట్టి జేబులు నింపుకున్న తర్వాత భూముల ధరలు సవరిస్తారా?. అంటే పారిశ్రామికవేత్తలకు ఒక విధానం, పేదలకు ఒక విధానమా? సవరించిన భూముల రేట్లు కేవలం పేదలకేనా? ధరలు సవరించే వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములు కట్టబెట్టడాన్ని ఎందుకు ఆపడం లేదు? ఏడు రోజుల్లో దరఖాస్తు, ఏడు రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల్లో డబ్బు కట్టడం వెనుకున్న మతలబేమిటి? కమీషన్ల కోసమే రిజిస్ట్రేషన్ విలువను సవరించకుండా ఈ భూములు కట్టబెట్టడం లేదా? సమాధానం చెప్పాలి. భూముల ధరలు సవరించిన తర్వాత పాలసీ తెస్తే అదనపు ఆదాయం వచ్చేది కాదా?
ఉదాహరణకు చదరపు గజానికి రూ.వంద విలువ ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.రెండు వందలు తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30కే కట్టబెడుతున్నది. అంటే రూ.170 నష్టపోతున్నది వాస్తవం కాదా? రూ.200 వసూలు చేయాల్సిన చోట రూ.30కి ఎందుకు తగ్గించారు. రాష్ట్ర ఖజానాకు రూ.లక్షల కోట్లు రాకుండా నష్టం చేస్తున్నది వాస్తవం కాదా?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తెస్తే నాడు ‘నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్’ అని రేవంత్‌రెడ్డి అన్నాడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి ముక్కుపిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేశాడు. జీవో – 135ను తెచ్చి.. పేదవాడు కొన్న భూమికి అయితే రిజిస్ట్రేషన్ ధరలపై ముక్కుపిండి 60, 80శాతం ఎల్ఆర్ఎస్ వసూలు చేశారు. ఎల్ఆర్ఎస్ కింద పేదల నుంచి ఎస్ఆర్వో విలువలో 80 శాతం వసూలు చేశారు. దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేశారు. కానీ ఇప్పుడు వేలాది ఎకరాలకు కేవలం 30 శాతమే తీసుకుంటున్నారు. పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం ఉంటదా? ఈ పాలసీ ఎవరికోసమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి?. రూ.వేలకోట్లకు పడగలెత్తిన బడా పారిశ్రామికవేత్తలకు ఒక రూల్.. పేదలకు ఒక రూల్ ఉందా?.
ఈ పాలసీలో ఓఆర్ఆర్ లోపలే కాకుండా ఓఆర్ఆర్ చుట్టు పక్కల భూములు కొల్లగొట్టే కుట్ర దాగుంది. ఇది రేవంత్ రెడ్డి, అనుముల సోదరులు జేబులు నింపే పాలసీనా, కాదా? సమాధానం చెప్పాలి.
ప్రభుత్వ ఖజనాను కొల్లగొట్టడమే కాకుండా.. ఈ పాలసీ వెనక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉన్నది. పక్కా ప్రణాళికతో ఆరు నెలల కిందటే ఈ పాలసీని రూపొందించారు. తక్కువ ధరకే విలువైన ఇండస్ట్రియల్ భూములు కొట్టేసేలా ఎనుముల బ్రదర్స్, వాళ్ల అనుయాయులు అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇప్పటికే సగం భూమి వీళ్ల చేతుల్లోకి వెళ్లింది. భూములు కొన్న తర్వాత పాలసీని తీసుకువచ్చారు. ఆ భూములు ఏమిటి? ఎవరెవరు ఎక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారో త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ముందే కమీషన్లు, వాటాలు చేసుకుని కంపెనీలతో మాట్లాడుకుని అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆ భూముల్లో 50:50 శాతంతోపాటు ఫ్లోర్లు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ.
ఎస్ఆర్వో విలువలో 30 శాతం వసూలు చేసే డబ్బుతో పారిశ్రామికవేత్తలకు ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా? పారిశ్రామికవాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి వాడతారా? లేక వచ్చిన డబ్బును కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు వాడతారా? ప్రజలకు సమాధానం చెప్పాలి.
నాడు పరిశ్రమలు, మన యువతకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకు భూములు ఇచ్చారు. కాలుష్యం, ఇతర కారణాలతో కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. కానీ రాష్ట్రంలో 30 శాతానికే భూములను ధారదత్తం చేసి ఫీజులు లేకుండా మల్టిపుల్జోన్లుగా కన్వర్ట్గా చేసి వాళ్లను బిల్డర్లు, వ్యాపారులుగా తయారుచేస్తున్నారు. పది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటే పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్ ఇవ్వాలి కానీ, కమర్షియల్, సినిమా టాకీసులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పారిశ్రామిక వేత్తలకు రెండోసారి ఇన్సెంటివ్‌లు ఎందుకు ఇస్తున్నారు?
