హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకు దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా తన చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. చివరకు పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నడని దుయ్యబట్టారు. విద్యార్థులను ముందు పెట్టుకొని నీచంగా మాట్లాడి, ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను దిగజార్చారని దుయ్యబట్టారు. ‘అచ్చోసిన ఆంబోతు అంటడు, సమాధి అంటడు. కనీసం సోయి లేకుండా మాట్లాడిండు. ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్‌రెడ్డీ? అని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పది ఫలితాల సందర్భంగా రవీంద్రభారతిలో రాజకీయాలు మాట్లాడి, దాని గౌరవాన్నే తగ్గించినవు’ అంటూ రేవంత్‌పై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ముమ్మాటికీ విలనే
‘కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్. అది ఇచ్చినోళ్ల గొప్పతనమా, సాధించినోళ్ల గొప్పతనమా?’ అని హరీశ్ ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎందుకు రావడం లేదని రేవంత్ అంటున్నారని, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, తమది ప్రజా పాలన అని చెప్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి జపాన్ వెళ్లి వచ్చిన తర్వాత మైండ్ పాడైనట్టుందని, లేదంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయి ఉంటుందని దుయ్యబట్టారు.
సవాల్‌ను స్వీకరిస్తున్నా..
రేవంత్ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు హరీశ్‌రావు ప్రకటించారు. ‘కాళేశ్వరం మీద చర్చ పెడదామా? రుణమాఫీ మీద పెడదామా? రైతుబంధు మీద పెడుదామా? బోగస్ 60వేల ఉద్యోగాల మీద పెడదామా? కులగణన మీద పెడదామా? దేనికైనా రెడీ. ప్లేస్, టైం మీరే చెప్పండి’ అంటూ హరీశ్ సవాల్ విసిరారు. పదేండ్లు తానే అధికారంలో ఉంటానని పగటి కలలు కంటున్న రేవంత్‌రెడ్డి.. ఉన్న మూడేండ్లు కుర్చీ సక్కగ ఉండేలా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. అతి తకువ కాలంలో అన్నివర్గాల ప్రజలతో తిట్లు తింటున్న ఏకైక సీఎం రేవంతేనని తూర్పారపట్టారు. ‘కేసీఆర్ నీ పేరు పలకాలని ఎన్నో రోజుల నుంచి అడుకుంటున్నావు కదా. కుసంసారం, కుంచిత స్వభావం ఉన్న నీ లాంటి వారి పేరును కేసీఆర్ ఎత్తాల్సిన అవసరం ఏమిటి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కేసీఆర్ కిట్టు, దళితబంధు, పింఛన్లు ఆగలేదా?
ఏ పథకం ఆగిందో చెప్పాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని, కేసీఆర్ కిట్, దళితబంధు, బీసీబంధు, గొర్రెల పంపిణీ, రెండు నెలల పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఆగలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు, విద్యార్థినులకు సూటీలు, మహిళలకు రూ.2,500, తులం బంగారం, కౌలు రైతులకు భరోసా, రూ.15వేల రైతు భరోసా.. ఏమైందంటూ పథకాల పేర్లతో రేవంత్‌రెడ్డిని కడిగి పారేశారు.
విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న సీఎం
విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ఇలాంటి సీఎం బహుశా ఎకడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపులో మాత్రమే కాదు.. ఆయన నిలువెల్లా విషం నింపుకున్నడని, కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక పది ఫలితాలను అడ్డం పెట్టుకుని బయటకు కకిండని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి, కుక తోక వంకర.. అని రేవంత్ మరోసారి రుజువు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.