చిన్న భాగమైన మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఇప్పుడు అదే కాళేశ్వరం వ్యవస్థను బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు.
– హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార అని, ఇది వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లిని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు భూ సేకరణ కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపుగ్రామాల తరలిం పు జరగలేదు. కరీంనగర్-మంచిర్యాల రాజీ వ్ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మించలేదు. 144 మీటర్లకు నీరు చేరితే పాత లోలెవెల్ బ్రి డ్జి మునిగిపోయేది.
రాకపోకలు బంద్ అయ్యే వి. మీ హయాంలో ఎల్లంపల్లి బరాజ్ పూర్తి అయినా పై కారణాలతో పూర్తిస్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయింది. తెలంగాణ వచ్చాకే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కాలనీలకు తరలించి, రాజీవ్ రహదారిపై వేగంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు 20 టీఎంసీల నీటిని నింపినం. ఇందు కు 2,052 కోట్లు వెచ్చించినం. బరాజ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి నం’ అని హరీశ్‌రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’గా మార్చాకే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభమైందని తెలిపారు.
ఎల్లంపల్లి అప్పుడు ప్రాణహిత చేవెళ్లలో భాగంగా ఉండేది. రీ ఇంజినీరింగ్ తర్వాత కాళేశ్వరంలో భాగమైంది. అవి కాళేశ్వరంలో భాగం అయిన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లే అయినా కాళేశ్వరం వ్యవస్థ ద్వారా చేరిన గోదావరి నీళ్లే కదా.
– హరీశ్‌రావు
అంబేదర్ పేరు మీద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు ఉన్నాయని మంత్రి పొన్నం నిజాయితీగా ఒప్పుకున్నందుకు సంతోషమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ దాకా అలైన్మెంట్ మార్చలేదని, సీడబ్ల్యూసీ సలహాల మేరకు ఈ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలేనని, రీ ఇంజినీరింగ్ తర్వాత 141 టీఎంసీలకు పెరిగిందని స్పష్టంచేశారు. ఆ పెరిగిన టీఎంసీలతోనే జలాశయాల్లో ఈ రోజు నీటిని నింపగలిగారని, అవి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినా కూడా మీరు వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన సదుపాయాలనే కదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రక్రియ అర్థమైతే పొన్నం ప్రభాకర్ ఇవి కాళేశ్వరం నీళ్లు కావని అనేవారు కాదని తెలిపారు. ‘శ్రీరాంసాగర్ వద్ద వరద ఉంటే, నీటి లభ్యత ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు-1, లింకు-2లో పంపులు నడుపరు. శ్రీరాంసాగర్ వద్ద నీరు లేకపోతే, ఎల్లంపల్లి వద్ద నీటి లభ్యత ఉన్నట్టయితే లింకు-1లో పంపులు నడపరు. లింకు-2 నుంచే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, అకడినుంచి లింకు-4లో ఉన్న పంపుల ద్వారా అ న్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని లిఫ్ట్ చే స్తారు. ఈ రెండు చోట్ల నీరు లేని కాలంలోనే లింకు-1లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి, అకడినుంచి లింకు-2 లో పం పింగ్ ద్వారా మిడ్‌మానేరుకు, అకడినుంచి లింకు-4లో పంపింగ్ ద్వారా ఎగువన ఉన్న 4 జలాశయాలకు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్‌కు, మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు, బస్వాపూర్‌కు పంప్ చేస్తారు. ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న వెసులుబాటు’ అని హరీశ్‌రావు వివరించారు.
‘ఈ ఏడు శ్రీరాంసాగర్, ఎల్లంపల్లిల వద్ద నీటి లభ్యత ఉన్న కారణంగా ఎల్లంపల్లి నుంచే నీటిని పంపింగ్ చేశారు. ప్రకృతి అన్ని సీజన్లలో ఈ రకంగా సహకరించే అవకాశం లేదు. ముఖ్యంగా వేసవి సీజన్లో నీటిని మేడిగడ్డ వద్ద నుంచే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక సమగ్ర గోదావరి వ్యాలీ అభివృద్ధి ప్రాజెక్టుగానే చూడాలి తప్ప విడివిడి ప్రాజెక్టులుగా చూడటం అనేది అవగాహనారాహిత్యం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నాలుగేండ్ల్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ద్వారా సుమారు 20,33,572 ఎకరాలకు (కొత్త + స్థిరీకరణ) సాగునీరు అందిందని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇది అబద్ధమైతే, ఆ అబద్ధాలు చెప్పి శాసనసభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వాలి.
– హరీశ్‌రావు