హైదరాబాద్: కేసీఆర్ పాలనలో దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూకట్టారు. కాంగ్రెస్ రెండేండ్ల కాలంలో వృద్ధి రేటు తగ్గిపోయింది. తుపాకీ గురిపెట్టి వసూలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పింది. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు కోసం కమీషన్లు వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో45 ఫ్లైఓవర్లు నిర్మించామని, ఐటీ అభివృద్ధిలో బెంగళూరును దాటిపోయామని చెప్పారు. అలాంటిది గూగుల్ లాంటి కంపెనీ హైదరాబాద్‌ను కాదని ఏపీకి ఎందుకు పోయిందని ప్రశ్నించారు. తాము రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చామని వెల్లడించారు. 2014 వరకు తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటిని 35కుపెంచామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని వాసవి అపార్ట్మెంట్ వాసులతో హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తది అన్నట్లుగా కేసీఆర్ పాలన సాగింది.
ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగనని చెప్పిన ఏకైన నాయకుడు కేసీఆర్. ఎంతో మంది పాలించారు, ఎవరూ కనీసం తాగునీరు అందించలేదు. మిషన్‌భగీరథను ఆదర్శంగా తీసుకొని మోదీ హర్‌ఘర్ జల్ ప్రారంభించారు. ఎనిమిదేండ్లు అయినా హర్‌ఘర్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తి చేయలేదు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించాం.
ఒక్క హైదరాబాద్‌లోనే 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన షీటీమ్ దేశానికి దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. దీంతో దేశంలో అధికంగా వరిధాన్యం పండే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య ఉత్పత్తి నుంచి 2 కోట్ల 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికి పెంచాం. వ్యవసాయంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ. జీఎస్డీపీ గ్రోత్‌రేట్‌లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేసీఆర్ నిబద్ధతతో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపించారు. సూపర్‌స్టార్ రజనీకాంట్ హైదరాబాద్‌ను చూసి న్యూయార్క్‌లో ఉన్నామా అన్నారు.
తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కంపెనీలు క్యూకట్టి తెలంగాణకు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేవంత్ గన్ కల్చర్ తీసుకొచ్చారు. సిమెంట్ కంపెనీ యజమానిని గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పింది. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. రేవంత్ అసమర్ధతతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రియల్ ఎస్టేట్ పర్మిషన్లు, నిర్మాణ అనుమతులకు 30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారు’ అని హరీశ్ రావు అన్నారు.