సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై హరీష్ రావు చర్చించారు.
ఈ చర్చలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా ఉన్నారు. సకాలంలో జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించాలని, తద్వారా జీవాలు మృత్యువాత పడకుండా కాపాడాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు మొట్ట మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన సంచార పశు వైద్యశాల (ఎంవీసీ)లను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రారంభించడం నిదర్శనం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పశుసంవర్ధక శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలను కేటాయిస్తున్నారని, అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీవాలకు అవసరమైన మందులు అన్ని పశువైద్య శాలల్లో అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. జీవాలకు వైద్య సేవలు అందించే మరింత మంది నిపుణులను తయారు చేసే విధంగా రాష్ట్రంలో త్వరలో నాలుగు వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలు పాడి రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాంటి పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. 370 కోట్ల రూపాయల ఖర్చుతో 58,992 పాడి గేదెలను సబ్సిడీపై పంపిణీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పాల సేకరణపై లీటరు పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం అందించడం, సబ్సిడీపై గడ్డి విత్తనాల సరఫరా, ఉచితంగా పశువులకు వైద్య సేవలు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాల అమలుతో నష్టాలలో ఉన్న విజయ డెయిరీ నేడు 800 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు.
ఇటీవల విజయ డెయిరీ సేకరిస్తున్న పాల ధరను పెంచిన ఫలితంగా అదనంగా మరో 30 వేల లీటర్లకు పాల సేకరణ పెరిగిందని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రజల నుండి ఎంతో ఆదరణ ఉందని, గర్బిణీ మహిళలకు ప్రభుత్వం అందజేసే న్యూట్రిషన్ కిట్లలో విజయ డెయిరీ నెయ్యిని అందించడం జరుగుతుందని చెప్పారు. ఇవే కాకుండా పాల ఉత్పత్తిని పెంచేందుకు, మేలుజాతి పశుసంపద అభివృద్ధి కోసం కృత్రిమ గర్భధారణ శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపాల మిత్రల ద్వారా ఇంటింటికి వెళ్ళి కృత్రిమ గర్భదారణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో కూడిన మెగా డెయిరీ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
కుల వృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీని చేపట్టగా, రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. పెంపకం దారులు తక్కువ ధరకు గొర్రెలను అమ్ముకొని నష్టపోకుండా అన్ని జిల్లాలలో గొర్రెల మార్కెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్య సంపద మూడింతలు పెరిగిందని, మత్స్య కారుల ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయని చెప్పారు. 2021-22 సంవత్సరంలో 23,263 నీటి వనరులలో 76 కోట్ల రూపాయలను ఖర్చుతో 77.49 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా.. 5,410 కోట్ల రూపాయల విలువైన 3.76 టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని వివరించారు.
ఈ సంవత్సరం 26,778 నీటి వనరులలో 88.53 కోట్ల చేప పిల్లలను 68 కోట్ల రూపాయల వ్యయంతో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరుగా మారాలనే ఆలోచనతో ఉచితంగా రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2021-22 సంవత్సరంలో 275 నీటి వనరులలో 20.85 కోట్ల రూపాయల వ్యయంతో 8 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయగా.. 448.96 కోట్ల రూపాయల విలువైన 13,827 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 350 నీటి వనరులలో 25 కోట్ల రూపాయల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.