సిద్దిపేట: ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గ్రామపంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవన్నారు. చెత్త సేకరణ చేసే దిక్కులేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒక్కరోజైనా పారిశుధ్యంపై సమీక్ష చేయలేదని ధ్వజమెత్తారు. విషజ్వరాల బారినపడి ప్రజలు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీల నిర్వహణకు కేసీఆర్ ప్రభుత్వం రూ.300 కోట్లు ఇచ్చేందని, రేవంత్ 10 పైసలైనా ఇవ్వలేదని చెప్పారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో కొనతం మహేష్ (34), న్యాయని శ్రావణ్ కుమార్ (16) డెంగ్యూ బారినపడి మరణించారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కొనతం మహేష్, న్యాయని శ్రావణ్ కుమార్ డెంగ్యూతో మరణించడం బాధాకరం. గ్రామంలో దాదాపు 60 కుటుంబాల వారు డెంగ్యూతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనేకమంది ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం చేసి ఊరురా ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చి ప్రతి నెల గ్రామపంచాయతీకి నిధులు ఇచ్చేది. నేడు పంచాయతీ సెక్రెటరీలు అప్పుల పాలై సమ్మె ప్రకటించే పరిస్థితి వచ్చింది.
గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు. గ్రామపంచాయతీలో దోమలకు స్ప్రే చేద్దామన్నా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డబ్బులు లేవు. ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు. చెత్త సేకరణ జరగడం లేదు. గ్రామాలంతా అయోమయం, గందరగోళం అయిపోయాయి. ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయి. వైరల్ ఫీవర్లకే అప్పుల పాలై ప్రజలు రూ.లక్షల్లో ఖర్చు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పోయి, వైద్యం కరువైపోయి ప్రైవేట్లో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటించారా? కనీసం పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారా?.
బీఆర్ఎస్ ప్రభుత్వం దోమలు రాకుండా రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పల్లెల్లో ప్రజలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. రైతులు రోడ్లపై పడ్డారు.. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. గ్రామపంచాయతీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విష జ్వరాలు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పట్టణాల్లో, గ్రామాల్లో కనీసం మోరీలు బాగుచేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. గ్రామ పంచాయతీల నిర్వహణపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకి రూ.300 కోట్లు గ్రామపంచాయతీలకు ఇచ్చేవారు. రేవంత్ రెడ్డి కనీసం పది పైసలైన ఇచ్చాడా?. మీ ఇంటలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తున్నది. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే తప్ప ప్రజల ఇబ్బందులను మీకు చెప్పడం లేదా. నీ పాలన ఎంతసేపూ ప్రతిపక్షాలపై కుట్రలు, కేసీఆర్ ఇబ్బందులు పెట్టడమే తప్ప నువ్వు చేసింది ఏముంది.
యూరియా బస్తాల కోసం రైతులు మబ్బుల మూడు గంటలకు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. యూరియా బస్తాలు దొరకడం లేదు. కానీ ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు మస్తు ఉన్నాయి. మందు మాత్రం ఫుల్లు.. యూరియా మాత్రం నిల్లు. మండలానికి వైన్ షాపు, బార్ షాపు పెడతాడట. కానీ దావఖానలో ప్రజలకు మందులు లేవు. రైతులకు యూరియా సంచులు లేవు. తులం బంగారం దేవుడెరుగు కానీ యూరియా బస్తాలే బంగారం అయ్యాయి. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 26వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెచ్చి స్టాక్ పెట్టాం. ఇప్పుడు కనీసం 3 వేల మెట్రిక్ టన్నులు కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఊరికే లారీలు వచ్చేది. యూరియాని అక్కడే అందించే వాళ్లం. రేవంత్ పాలన రైతులకు కాలరాత్రులను మిగిల్చింది. యూరియా కోసం జాగారాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఒక యూరియా బస్తా దొరికితే లాటరీ దొరికినట్టు అనుకునే పరిస్థితి వచ్చింది.
డెంగ్యూతో మరణించిన యువకుల తల్లిదండ్రుల కడుపుకోతకు ఎవరు బాధ్యులు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువకులైన మహేష్, శ్రావణ్ చనిపోయారు. వారివి ప్రభుత్వ హత్యలు. ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోయారు. రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పరిపాలన చాతకావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. తిట్టుడు బందు పెట్టి పాలనపై దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి. లేకపోతే జనాలు తిరగబడతారు జాగ్రత్త.’ అని హరీశ్ రావు అన్నారు.