హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు బాకీ పడిన రూ.24 వేలు ఎంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీని నెరవేరుస్తారని చెప్పారు. కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు హరీశ్ రావు ఆటోలో ప్రయాణించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రైతులు, చిరు ఉద్యోగులు, మహిళలు, ఆటో డ్రైవర్లు కావచ్చు.. అందరూ ఆవేదనలో ఉన్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. పేరుకి ఉచిత బస్సు అన్నారు, మహిళలకు ఫ్రీ అన్నారు. మొగోళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నారు. టికెట్ రేట్లు పెంచి కుటుంబం మీద భారం వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదుసార్లు బస్ చార్జీలు పెంచింది.
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కి వచ్చి సినిమా నటులకంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగులను వాడుకొని ఓట్లు, డబ్బులు తీసుకొని.. నిరుద్యోగ యువతీ యువకులను వదిలేశారు. నాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. ఆటోనగర్, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోనగర్ అసలే లేదు. ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచుతామని పత్తా లేదు. ఇస్తామన్న రూ.12 వేలకి దిక్కు లేదు. రాష్ట్రంలో ఉన్న 5 నుంచి 6 లక్షల ఆటోలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఆటోకు రూ.24 వేలు బాకీ పడింది. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారు. వాటికోసం పైసలు ఉన్నాయి. కానీ ఆటో కార్మికులకు నెలకు రూ.1000 ఇవ్వడానికి లేవా?. రేవంత్ రెడ్డి నెల నెల మూటలు మోస్తూ ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు అంత చిన్న చూపు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తున్నాం, లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ నిర్మిస్తానంటున్నావు. కానీ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1000 ఇవ్వలేవా రేవంత్ రెడ్డి?. రాహుల్ గాంధీ.. ఓట్ల కోసం ఆటో ఎక్కి తిరిగావు. ఇప్పుడు ఆటో కార్మికుల కష్టాలు పట్టవా?. మరోసారి రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే శంషాబాద్‌లో ఆటోలతో నిరసన తెలుపుతాం. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఆటో కార్మికులకు రెండేండ్ల బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుంది.
రూ.3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై రూ.3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. అందులో నుంచి రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి వారిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆటో కార్మికులు ఎక్కడ ఉన్నా కాంగ్రెస్‌ని ఓడించేలా పనిచేయండి. ప్రతి ఆటో అన్న రెండు ఫోన్లు చేసి మీ బంధుమిత్రులకు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్కి ఓటు వేయాలని చెప్పండి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తాడు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది. అసెంబ్లీలో ఆటో డ్రైవర్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అసెంబ్లీని స్తంభింపజేస్తాం. కేసీఆర్ మళ్ళీ వస్తారు. ఆటో డ్రైవర్ల కష్టాలు తీరుస్తారు.’ అని హరీశ్ రావు అన్నారు.