Harish Rao | హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. బషీర్‌బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమని అంటున్నారు. ఇంత కంటే జోక్ ఉంటుందా..? తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్ అంశంపై అని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
నాటి సీఎం చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. 2000, ఆగస్టు 28న బషీర్‌బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడు రైతు హృదయంతో కేసీఆర్ స్పందించారు. అధికార పార్టీలో ఉండి, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరారు. ఈ ఛార్జీలు తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారుతాయని, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమై పోతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి చంద్రబాబుకు లేఖ రాశారు. నాడు చంద్రబాబు రైతులను కాల్చి చంపితే.. కడుపు రగిలి మా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బిల్లులు తగ్గించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇప్పుడు మాట్లాడే వారి నోటికి మొక్కాలి అని హరీశ్‌రావు అన్నారు. ఏదంటే ఏది మాట్లాడితే సమాజం సహించదు. సమాజం తెలివైనటువంటిది. విశ్లేషించుకోగల సామర్థ్యం ఉంది. ఉద్యమం పుట్టిందే విద్యుత్‌లో నుంచి అయితే.. కాల్పులకు కేసీఆర్ కారణం అనడం సరికాదు. డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవులను గడ్డిపోచల్లా మాదిరిగా కేసీఆర్ వదిలేశారు. మీరేమో పదవుల కోసం చొక్కాలను మార్చినట్టు పార్టీలను మారుతున్నారు. కానీ కేసీఆర్ ప్రజల కోసం పదవులను వదులుకున్నారు. ఇవాళ కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. కరెంట్ వస్తలేదని అంటున్నారు కదా.. డైరెక్ట్ వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటే తెలుస్తుంది కదా అని హరీశ్‌రావు సూచించారు.