హైదరాబాద్: ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అడ్డుకోవడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బ్యారైకెడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెప్పారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలని విమర్శించారు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు.
తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం… pic.twitter.com/R6cUkfeJSX
— Harish Rao Thanneeru (@BRSHarish) November 26, 2024