హైదరాబాద్: ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగాయన్నారు. డెంగ్యూ కేసులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేవున్నారు. ప్రజారోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉన్నదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని చెప్పారు. డెంగ్యూపై సమీక్ష చేయకుండా.. విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇంబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం పల్లా రాజేశ్వర్రెడ్డిదన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత తప్పుంటే కూలగొట్టాలన్నారు. రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో పల్లా భూములు లేవని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు నివేదికలు ఇచ్చాయి. జిల్లా కలెక్టర్ కూడా ఎన్వోసీ జారీచేశారు. హెచ్ఎండీఏ అనుమతితోనే కాలేజీ నిర్మాణం చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజకీయ ప్రేరిత విషయాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని చెప్పారు. విద్యా సంస్థలు, దవాఖానలపై రాజకీయ కక్షలు ఎందుకని ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అక్రమంగా ఆరు కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలకు మాత్రం సీట్లు తగ్గించారని వెల్లడించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా కక్ష సాధించడం మంచిదికాదన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యమ నాయకుడని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు. ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అయ్యి అరెస్టు అయ్యాడు. ఆనాడు ప్రభుత్వంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ గలిగిన ప్రజా ప్రతినిధిగా ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ పెట్టుకొని కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నది. పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. రూ.300 కోట్ల ఫైన్ కట్టాలి అని నోటిసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగానే అన్ని మర్చిపోయారు, కేసులు కూడా ఆటకెక్కాయని చెప్పారు.
రుణమాఫీ పేరుతో మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. సాంకేతిక కారణాల పేరుతో మంత్రులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై పెట్టిన గడువలన్నీ జోక్ అయ్యాయని ఎద్దేవాచేశారు. ప్లానింగ్ లేక కుంటిసాకులు చెబుతున్నారని వెల్లడించారు. ఆర్మూర్‌లో రైతులు భారీ ధర్నా చేపట్టారని, తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పుల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హాయాంలో ఆస్తుల కలప్పన చేశామని, అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించామన్నారు. రూ.72 వేల కోట్లు రైతుబంధు ఇచ్చామని తెలిపారు. అప్పుల పేర్లు చెప్పి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అలవికాని హామీలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.68 వేల కోట్లు అప్పులు చేసింది. రేవంత్ రెడ్డికి అప్పుల గురించి మాట్లాడే హక్కుందా అని నిలదీశారు. రాష్ట్రం సమస్యల వలయంలో ఉంటే మీరు ఢిల్లీ ప్రయాణాలు చేస్తున్నారు. రాత్రికిరాత్రి వచ్చి ప్రతిపక్షాలపై దాడులు చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.
Live : BRS Leaders Press Conference at Telangana Bhavan.@BRSHarish @VPR_BRS @PRR_BRS https://t.co/p4aFAI9aCD
— BRS Party (@BRSparty) August 25, 2024