వరంగల్ : మాజీ జడ్పీటీసీ సరిత ఆకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సరిత ఎంతో కృషి చేశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల మాజీ జడ్పీటీసీ చాడ సరిత దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సరిత కమిట్మెంట్ ఉన్న నాయకురాలు అన్నారు.
ధర్మసాగర్ నుంచి వేలేరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణంలో ఆమె కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. దేవాదుల నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో కూడా వారి పాత్ర ఉంది. చిన్న వయసులోనే జెడ్పిటిసిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ చాలా చిన్న వయసులోనే తాను మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికార పార్టీ నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు.
వారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. పార్టీ పరంగా అన్ని విధాలుగా సరిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మా రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.