న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : నెలల తరబడి తీర్పులను రిజర్వ్‌లో పెట్టడంపై హైకోర్టులపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులు తీర్పులను వెలువరించకుండా నెలల తరబడి రిజర్వ్‌లో ఉంచే పద్ధతి ‘గుర్తించదగ్గ వ్యాధి’ అని.. దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించింది. ‘న్యాయమూర్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు కష్టపడే న్యాయమూర్తి. చాలా కేసులు విచారించి, తీర్పులు రిజర్వ్ చేసి, తమ సామర్థ్యం మేరకు తీర్పులు ప్రకటిస్తారు. మరో కొందరు జడ్జిలు వైపు మాత్రం తీర్పులను వెలువరించరు.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘మేం ఎవరినీ వ్యక్తిగతంగా ఎత్తి చూపడం లేదు. ఇది న్యాయ వ్యవస్థ ముందున్న సవాల్. ఇది గుర్తించదగ్గ వ్యాధి. దీనికి చికిత్స చేసి పూర్తిగా నిర్మూలించాల్సి ఉంది. ఇది మరింత వ్యాపించడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక కేసును విచారించిన జార్ఖండ్ హైకోర్టు.. కేసును కొట్టివేస్తున్నట్టు గత ఏడాది డిసెంబర్ 4న మౌఖికంగా ప్రకటించినప్పటికీ తీర్పును అధికారికంగా అప్లోడ్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసును విచారించిన సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.