చుంచుపల్లి, జూలై 20 : విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రుద్రంపూర్ హెచ్ఎం బి. బాలాజీ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న LFL ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రుద్రంపూర్లో సోమవారం నుండి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు విడతలుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణలో తొలి విడతకు జిల్లాలోని పలువురు ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన బి.బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని సంపాదించడంతో పాటు పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు.
రాష్ట్ర రిసోర్స్ పర్సన్ స్వరూప్ కుమార్ మాట్లాడుతూ.. ఈ శిక్షణలో సమ్మిళిత విద్య, డిజిటల్ ఎడ్యుకేషన్, ప్రధానోపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యార్థుల్లో FLN (Foundational Literacy and Numeracy) నైపుణ్యాల పెంపు, పాఠశాల కార్యక్రమాల సమర్థ నిర్వహణ, రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో రిసోర్స్ పర్సన్లు బి.శంకర్, బి.శ్రీశైలం, కె.స్వరూప భవాని, ఎల్.రాందాస్ శిక్షణ అందించగా, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన LFL ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ప్రధానోపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలు మరింత మెరుగుపడి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.