న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : టెక్ దిగ్గజం, ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యాజమాన్యం మెటా గోప్యతా విధానంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అమెరికన్ కంపెనీని మందలిస్తూ మీరు గోప్యతతో ఆటలాడలేరని, మా డాటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. భారతీయులను దోపిడీ చేయడానికి ఈ గోప్యతా విధానం నిలబడలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ 2021 గోప్యతా విధానం ముఖ్యంగా రూ. 213 కోట్ల జరిమానా విధిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన తీర్పును కంపెనీ లా ట్రిబ్యునల్ సమర్థించడానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కంపెనీ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని ఆదేశిస్తూ ప్రకటనల కోసం డాటాను వినియోగించుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించడంపై కూడా సీసీఐ క్రాస్ అప్పీలును దాఖలు చేసింది.
ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ వాణిజ్య అవసరాల కోసం యూజర్ డాటాను పంచుకునే దోపిడీ విధానాన్ని విమర్శించారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ మా రాజ్యాంగాన్ని పాటించలేకపోతే భారత్‌ను వదిలిపెట్టండి. దేశ పౌరుల గోప్యతపై రాజీపడేందుకు అనుమతించబోము అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాదిమంది పేదలు, చదువు రాని ప్రజలు ఈ విధానాన్ని అర్థం చేసుకోగలరా? అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. తమిళం మాత్రమే మాట్లాడగల ఓ పేద మహిళ లేదా ఓ రోడ్డు పక్క చిరు వ్యాపారి దీన్ని అర్థం చేసుకోగలరా? అని కూడా సీజేఐ మెటాను ప్రశ్నించారు. మీ విధానాలను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు తమకు కూడా ఇబ్బందిగా ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ నిబంధన నుంచి వైదొలగవచ్చంటూ పిటిషనర్లు వాదించగా మెటా, వాట్సాప్‌పై ధర్మాసనం మండిపడింది. గ్రామీణ బీహార్‌లో నివసించే పేద ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరని, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు ఇదో మార్గమని, దీనికి తాము అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఓ ఉదాహరణను తానే కోర్టులో ఉంచారు. దీనిపై మెటా, వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పందిస్తూ అన్ని మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని, కంపెనీలు కూడా ఆ కంటెంట్‌ని చూడలేవని చెప్పారు.
మార్కెట్లో ఆధిపత్య స్థితిలో ఉన్న వాట్సాప్ కొత్త విధానాన్ని అంగీకరించాలని తన యూజర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నదని 2021 గోప్యతా విధానంపై 2024 నవంబర్‌లో ఇచ్చిన తన తీర్పులో సీసీఐ తెలిపింది. మెసేజింగ్ సేవలను నిరంతరం పొందేందుకు ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌లతో డాటా-షేరింగ్‌ను అనుమతించాల్సిన అవసరం ఉందని వాట్సాప్ వినియోగదారులకు చెప్పడాన్ని సీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా రూ. 213 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లు రోహత్గి నేడు కోర్టుకు తెలిపారు. 2025 జనవరిలో మెటా, వాట్సాప్ ఆ ఉత్తర్వును సవాలు చేశాయి. 2025 నవంబర్‌లో లా ట్రిబ్యునల్ వాట్సాప్ డాటా షేరింగ్‌పై ఐదు సంవత్సరాల స్టేను పక్కన పెట్టింది. అయితే జరిమానాను మాత్రం ట్రిబ్యునల్ సమర్థించింది.