న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంలోని చైనా అంశాన్ని ప్రస్తావించడంతో లోక్‌సభలో తీవ్ర అలజడి చెలరేగి సభ పలుసార్లు వాయిదాపడింది. సభలో రభస సృష్టించిన 8 మంది విపక్ష కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.
నిరసన తెలియచేస్తున్న విపక్ష ఎంపీలు స్పీకర్‌పై కాగితాలు విసరడం సభలో రభసకు దారితీసింది. దీంతో సభ మరోసారి సాయంత్రం 3 గంటలకు వాయిదాపడింది. సభ తిరిగి సమావేశం కాగానే రాహుల్ గాంధీ తాను జాతీయ భద్రతకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ సభలో రభస మొదలైంది.