హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల నిర్మాణం పేరిట ధనయజ్ఞానికి తెరలేపిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. హైబ్రిడ్ అన్యూటీ మాడల్ (హ్యామ్) విధానంలో చేపడుతున్న రోడ్ల టెండర్లలో దాదాపు రూ.18 వేల కోట్ల మేర అవినీతి జరుగుతున్నదని విమర్శించారు. ఆర్అండ్బీ శాఖలో రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నదని, ఈ నిధులు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫండింగ్ కోసమేనని దుయ్యబట్టారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, కొన్ని కంపెనీలు ముందే కుమ్మకై టెండర్లు వేస్తున్నాయని విమర్శించారు. సివేట్, సరళ, బృందా, బీవీఎస్ఆర్, జే ఇన్ఫ్రా వంటి సంస్థలు కుమ్మకై అధిక ధరలకు టెండర్లు పాడుకున్నాయని మండిపడ్డారు. మొత్తం 34 టెండర్లకుగాను, ఇప్పటివరకు తెరిచిన 24 టెండర్లలో సుమారు 16 చోట్ల ఇద్దరు మాత్రమే బిడ్లు వేశారని, ఇది ముందస్తు ఒప్పందంలో భాగమేనని ఆధారాలు సహా వివరించారు.
బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లతో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. అవినీతికి సహకరించిన అధికారులు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టబోమని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే విచారణ జరిపి నిందితులు అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన ఈ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెచ్చిందని మండిపడ్డారు. వెంటనే ఈ హ్యామ్ రోడ్ల టెండర్లను రద్దు చేసి, పారదర్శకంగా నిర్వహించాలని, ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాడు జలయజ్ఞంలో మొబిలైజేషన్ అడ్వాన్సు విధానం 3% ఉంటే, ఇప్పుడు దానిని కాంగ్రెస్ నేతలు 10 శాతానికి పెంచారని విమర్శించారు. దీంతో మొబిలైజేషన్ అడ్వాన్స్ కిందనే దాదాపు రూ.1,800 కోట్లు నేరుగా కాంట్రాక్టర్ల చేతికి వస్తాయని, ఆ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చులకు వాడుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్లు నిర్వహించిన చాలా పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని, రోడ్లకు గుంతలు పడినా మరమ్మతులు చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. కానీ, కమీషన్ల కోసం హ్యామ్ రోడ్ల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు పథకం వేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు సాధారణంగా 20%-30% వరకు టెండర్లు తకువ ధరకు వెళ్లాయని, కానీ, ఇప్పుడు 15%-20% అధిక ధరకు వెళ్తున్నాయని అన్నారు. దాదాపు 50% తేడా ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు. ఇప్పటివరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని విమర్శించారు.
కుమ్మకై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా ప్లాన్ చేశారని తెలిపారు. పంచాయతీరాజ్‌లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని విమర్శించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో 5% మాత్రమే ఎకువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యామ్ రోడ్లకు ఆ సీలింగ్ ఎత్తివేయడంతో ఎంత ఎకువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామినర్స్‌కు వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీలే ఆమోదించేలా నిబంధనలు మార్చారని ఆరోపించారు.
నల్లగొండలో హామ్ రోడ్లకు రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని, మూడు టెండర్లు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం 34 టెండర్లకుగాను 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని, టెండర్లలో సిండికేట్ అయ్యారని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖలో 7 పనులు సివేట్‌కు, 3 వర్క్‌లు జే ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సరళ, బృందాకు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్‌కు 5% సీలింగ్ ఉండేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యక్సెస్ ఎత్తివేశారని పేర్కొన్నారు. టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, తక్షణమే టెండర్లను రద్దుచేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు, రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టెండర్లలో పాలుపంచుకున్న అధికారులతోపాటు కాంట్రాక్టర్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లను రద్దు చేసిన తిరిగి పారదర్శంగా నిర్వహించాలని హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆర్ఎస్ తరపున ఈ అంశంలో మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు పట్టుబడుతామని చెప్పారు.
హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలనూ ఎలాగూ గడువులోగా అమలు చేయడం లేదని, కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా సమయపాలన పాటించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రా రంభం కావాల్సి ఉన్నది. ఆలోగానే బీఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చారు. 10 గంటల 4 నిమిషాలకు మంత్రు లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాతే స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నిర్ణీత సమయానికి సభను ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వరుసగా ఇదే పద్ధతి కొనసాగుతున్నదని విమర్శించారు. దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందిస్తూ బీఆర్ఎస్ సభ్యుల వల్లే ఆలస్యమైందంటూ తప్పించుకొనే ప్రయ త్నం చేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు 9 అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాల్సి ఉండగా, పలు ప్రశ్నలను తదుపరి సమావేశానికి స్పీకర్ వాయిదా వేశారు. దివ్యాంగుల పింఛన్, వివాహ ప్రోత్సాహకాలపై ఎమ్మెల్యేలు జాటోత్ రామ్‌చందర్‌నాయక్, ధన్‌పాల్‌సింగ్, రాజీవ్ యువవికాస స్కీమ్‌పై కూనంనేని సాంబశివరావు, గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్మెంట్పై పద్మావతిరెడ్డి ప్రశ్నలు అడగాల్సి ఉన్నది. సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రశ్నలను మినహాయిస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. దీనిపై హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో సదరు సభ్యులు ఉన్నా కూడా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభంకాగానే స్పీకర్ కొన్ని సూచనలు చేశా రు. సభ్యులు తమ ప్రశ్నకు సంబంధించిన అంశాన్ని, సదరు మంత్రి వివరణ సహా 9నిమిషాల్లో ముగించాలని ఆదేశించారు.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సైతం మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పడకేసిందని వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఎమ్మెల్యేకూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఆ నిధులతో కమ్యూనిటీ హాళ్లు, తదితర మౌలిక వసతులకు ఎమ్మెల్యేనే నిధులు మంజూరు చేసేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయడం లేదని మం డిపడ్డారు. ఇకనైనా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లాలో రోడ్ల దుస్థితిని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో వివరించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, హ్యామ్ మాడల్ కింద రోడ్లను మంజూరు చేస్తున్నా, అటు నిర్మాణానికి, రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఆర్టీసీ సంస్థ బస్సులను కూడా నడుపడం లేదని, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సైతం రోడ్ల అభివృద్ధిపై ప్రశ్నలు అడిగారు.
మాజీమంత్రి హరీశ్‌రావు సైతం సిద్దిపేట జిల్లాలోని రోడ్ల దుస్థితిని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రోడ్లపై తట్టెడు మట్టి పోయలేదని, మూరెడు రోడ్డు వేయలేదని విమర్శించారు. ఇకనైనా రోడ్లను మెరుగుపరచాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం రోడ్ల, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హ్యామ్ మాడల్ ద్వారా త్వరలోనే రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నామని వివరించారు. మంత్రి హ్యామ్ మాడల్ అని పలికిన ప్రతి సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు స్కామ్ అంటూ సభలో నినాదాలు చేశారు.