Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టారన్నారు. డిసెంబర్లో 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందన్నారు. పది నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి నెలకొందన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు సాధించిన ఘనత ఇదేనన్నారు.
విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావంటూ మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని.. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోవాలని హితవు పలికారు.