హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. చేయక.. చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులకే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. ‘మొన్న సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిన ఘటన.. నేడు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమీషన్ సరారు వైఫల్యానికి నిదర్శనం.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నదని గుర్తించినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. లోపల చిక్కుకుపోయిన కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. డీ వాటరింగ్ చేసి, వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్ చేశారు.