Harish Rao | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): పూటకోమాట చెప్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. పెళ్లికి వెళ్లడం కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం, నియామకపత్రాలు ఇవ్వకుండా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదలశాఖలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణమని విమర్శించారు.
ప్రచార ఆర్భాటం పక్కనపెట్టి, ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగ నియామకపత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కారు ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సంబురం లేకుండా చేస్తున్నదని ధ్వజమెత్తారు. నియామకపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని 5 సార్లు వాయిదా వేయడం, అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.